ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం మంచిది కాదంటూ సీఎం జగన్‌కు జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిందన్న వార్తలు రాష్ట్రంలో హాట్ టాఫిక్‌ గా మారాయి. విశాఖకు తుఫాన్ల ముప్పుతో పాటు పారిశ్రామిక కాలుష్యం, భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు కమిటీ నివేదిక ఇచ్చిందని.. అయితే ఆ విషయాన్ని జగన్‌ దాచిపెట్టి విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేసిందని కొన్ని మీడియా సంస్థలో వార్తలు వచ్చాయి. కాగా మీడియాలో వచ్చిన ఆ వార్తలు నిరాధారమైనవని కొట్టిపారేశారు జీఎన్‌ రావు. ప్రభుత్వానికి తాము సమర్పించిన నివేదిక పై తాజాగా క్లారిటీ ఇచ్చారు .

రాష్ట్రంలో 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించామని.. ఏపీ సమగ్రాభివృద్ధిపై కమిటీ ఇచ్చిన రీపోర్ట్‌పై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తల ప్రచురించాయన్నారు. విశాఖ, విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలపై అధ్యయనం చేశామని, విశాఖలో రాజధాని ఎటువైపు ఉండాలో కూడా నివేదికలో స్పష్టంగా పేర్కొన్నామన్నారు. మౌలిక సదుపాయాలు విశాఖలో అందుబాటులో ఉన్నాయని, విశాఖపట్నమే పరిపాలనా రాజధానిగా అత్యుత్తమమని స్పష్టం చేశారు.

సముద్రతీరానికి రాజధాని ప్రాంతం దూరంగా ఉంచాలని.. సుమారు 50 కి.మీ దూరంలో పరిపాలన భవనాలను ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు. సముద్రతీరం కోతకు గురికాకుండా ఎవరూ ఆపలేరన్న ఆయన.. తుఫాన్లు హైదరాబాద్‌లో కూడా వస్తాయని అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి ఆకాంక్షించే.. మూడు రాజధానులు ప్రతిపాదన సూచించినట్లు చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఉంటే నాలుగు జిరాక్స్ సెంటర్లు వస్తాయని అనడం సరైంది కాదన్నారు. జీఎన్ రావు కమిటీలో 40 ఏళ్లు అనుభవం ఉన్నవారు ఉన్నారని, ఎవరూ ప్రలోభాలకు లొంగే వారు కాదని స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు వివిధ రంగాల్లో అనుభవం కలవారని, నాలుగు నెలలు కష్టపడి పూర్తి రిపోర్టు అందజేశామని తెలిపారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.