పాతివ్రత్యం పాత మాట. కట్టుకున్న భర్త మాత్రమే చూడాల్సిన సొగసు..ఎవరెవరో చూసేస్తున్నారు. పెళ్లినాడు అగ్నిసాక్షిగా చేసుకున్న ప్రమాణాలను అదే అగ్నిగుండంలో వేసేస్తున్నారు. అవన్నీ ఏదో శాస్ర్తానికి చేయాలి కాబట్టి చేశామన్నట్లుంటోంది నేటి తరం. భర్త ఉన్నా వివాహేతర లైంగిక సంబంధమే ఇప్పుడు తాజా ట్రెండ్. మగాళ్లు మాటలెన్ని చెప్పినా చేతల్లో మాత్రం ఆడాళ్లే పై చేయి. మగాళ్లలో 43 శాతం మంది వివాహేతర లైంగిక సంబంధాలు కలిగి ఉండగా, మహిళల్లో మాత్రం 53 శాతం మంది తాళి బయటి కామకేళికి పాల్పడుతున్నారట. ఈ విషయం తాజాగా గ్లీడెన్ అనే డేటింగ్ సైట్ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ఈ గ్లీడెన్ వివాహేతర సంబంధాలను ప్రోత్సహించే సైట్. భారతీయ మహిళలు ఈ విషయంలో చాలా ఓపెన్ గా ఉంటున్నారని కూడా, కనీసం 40 శాతం మంది ఆఫీసుల్లో సన్నిహిత లైంగిక సంబంధాలను కలిగున్నారని కూడా సర్వే వెల్లడించింది.

అయితే వైవాహిక జీవితంలో ఒత్తిడులు, సమస్యలు, సవాళ్ల వల్లే వివాహేతర బంధాలను భారతీయ మహిళలు వెతుక్కుంటున్నారా అన్న ప్రశ్నకు మాత్రం సర్వే ఎలాంటి సమాధానమూ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ మహిళలు మాత్రం వివాహేతర లైంగిక బంధాలను కోరుకుంటున్నారని, ఒక జీవితం ఒకే భర్త అన్న కాన్సెప్టును కాదంటున్నారని ఈ సర్వే చెబుతోంది. ఇదంతా ఊసుపోక కబుర్లు అనుకుంటున్నారా? కాదండీ బాబూ.. గ్లీడెన్ 2017 లో భారత్ లో తన “వ్యాపారాన్ని” (అవును ఆ సంస్థకు ఇది వ్యాపారమే) ప్రారంభించింది. ఆ సంస్థకు కేవలం మూడేళ్లలో దాదాపు ఎనిమిది లక్షల మంది మహిళా సబ్ స్క్రైబర్లు ఉన్నారట. ఇంట్లో భర్త, బయట ప్రియుడు కావాలన్న కోరిక వారిలో ప్రబలంగా ఉందట. తాము అందించే ప్రైవసీ, పార్ట్నర్స్ ను ఎంచుకునే స్వేచ్ఛ వంటి కారణాలతోనే రోజూ వందల సంఖ్యలో కొత్త మహిళలు తమ డేటింగ్ యాప్ ను ఎంచుకుంటున్నారని సంస్థ ప్రతినిధులు భలే గర్వంగా చెప్పుకుంటున్నారు.

ఈ సర్వేలో బెంగుళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, ముంబాయి, కోల్ కతా, పుణే వంటి నగరాల్లోని 1500 మంది మహిళలు, పురుషులు పాల్గొంటున్నారట. ఈ సర్వే ప్రకారం ఇప్పటికే 55 శాతం మంది తమ భర్తనో, భార్యనో మోసం చేసి, ఇంకొక వ్యక్తితో సంబంధాలు పెట్టుకుంటున్నారట. ప్రతి పది మందిలో అయిదుగురు క్యాజువల్ సెక్స్ అంటే పెద్దగా ముందస్తు ప్లానింగ్ లేకుండా అపరిచితుడితో సెక్స్ లో పాల్గొన్నారట. 46 శాతం మంది భార్య లేదా భర్తను ప్రేమిస్తూనే ఇతరులతో సెక్స్ లో పాల్గొనవచ్చునని భావిస్తున్నారట. ఒకే సారి ఇద్దరితో ప్రేమలో ఉండవచ్చునని 48 శాతం మంది నమ్ముతున్నారట. అందుకే మన దేశంలో భర్త లేదా భార్యల్లో ఎవరికైనా వివాహేతర సంబంధం ఉన్నా జీవన భాగస్వాములు క్షమించేస్తున్నారట. ఈ సర్వే నిజంగా నిజమేనమాట అయితే..!!!

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.