ఈ ఫొటో చూస్తుంటే మనం ఎక్కడున్నాం అనిపిస్తోంది. పాఠశాలల్లో డ్రాప్‌ అవుట్స్‌కు ఈ ఫొటో సజీవ సాక్ష్యం. వరుసగా అమ్మాయిలు ఎందుకు నుంచున్నారు అనుకుంటున్నారు..? చెబితే పాలకుల సిగ్గు పోతుంది. చెప్పకపోతే  విషయం తెలవదాయా..?!. అందుకే చెబుతున్నాం..ఈ అమ్మాయిలు అందరూ టాయిలెట్‌కు పోవడానికి ఇలా లైన్‌లో నుంచున్నారు. 70 ఏళ్ల స్వాతంత్ర భారతావనిని నీవు ఎక్కడున్నావని ప్రశ్నించే ఫొటో ఇదీ. బంగారు తెలంగాణలో ఉన్నామా..?అసలు సాధ్యమేనా అని ప్రశ్నించే ఫొటో ఇదీ.

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు వీరందరూ. ఒకే టాయిలెట్‌తో ఇక్కట్లు పడుతున్నట్టు ఓ పత్రిక ప్రచురించింది. ఈ ఫొటో అందరినీ కదిలించింది. కదిలించడం కాదు..పాలకుల అసమర్ధతను బయట పెట్టింది. మాటలు కాదు..చేతలు కావాలి అని చెప్పే ఫొటో ఇది. విద్యాశాఖకు వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నారు అవి ఎటూ పోతున్నాయి..? ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? కేటాయిస్తున్నారే గాని..విడుదల చేయడం లేదా? విడుదలైతే..ఈ అమ్మాయిలకు ఈ దుస్థితి ఎలా వస్తుంది..?
పాలకుల చిత్తశుద్ధిని బయట పెట్టిన ఫొటో ఇది.

పాలకులు పట్టించుకోలేదు సరే..అక్కడున్న టీచర్లు ఏం చేస్తున్నారు. విద్యార్ధినులు ఒక్క టాయిలెట్‌తో ఇబ్బంది పడుతుంటే..తలా వెయ్యి వేసుకుని టాయిలెట్ కట్టించలేరా..?ఇది వారి సామాజిక బాధ్యత కాదా..? ఇక్కడి టీచర్లు కూడా పుస్తకాల్లో నీతులు పుస్తకాలకే పరిమితం అనుకున్నారా? . టీచర్ల స్వార్ధాన్ని కూడా ఈ ఫొటో ఘాటుగా ప్రశ్నిస్తుంది. డ్రాప్ అవుట్స్ ఉండకూడదంటారు..నేటి బాలలే రేపటి పౌరులంటారు..నేటి చిన్నారులే..రేపటి భవిష్యత్తు అంటారు..భవిష్యత్తును నిర్మించేడమంటే ఇదేనా..? పాలకులు, ఆ పాఠశాల టీచర్లు ప్రశ్నించుకోవాలి.

ఈ ఫొటో చూడగానే….రాజ్యసభ సభ్యుడు సంతోష్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్టారెడ్డి వెంటనే స్పందించి సహాయనికి ముందుకొచ్చారు. విద్యామంత్రి సబితమ్మ కొత్త టాయిలెట్ల నిర్మాణం కోసం ఆదేశాలిచ్చి మహిళగా తన సానుభూతిని వెల్లడించారు. మంచితే..మంత్రిగారు కాని..ఫొటో బయటకు వచ్చేదాకా పరిస్థితులు తెలుసుకోకపోతే ఎలా మేడం. ఇప్పటికైనా..తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా..? ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకోగలరని విజ్ఞప్తి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.