ఊయలలో ఊగుతూ.. చున్నీ మెడకు చుట్టుకుని బాలిక మృతి

By సుభాష్  Published on  29 March 2020 10:23 AM GMT
ఊయలలో ఊగుతూ.. చున్నీ మెడకు చుట్టుకుని బాలిక మృతి

బాలిక వయసు 14 ఏళ్లు.. చక్కగా చదువుకుంటూ సరదాగా ఆడుకునే సమయం. పైగా కరోనా వైరస్‌ కారణంగా తెలంగాణలో విద్యాసంస్థలన్నీ మూసి ఉన్నాయి. ఇంకేముంది పిల్లలకు ఆడుకోవడానికి ఎంతో సమయం. ఇంట్లో కబుర్లు చెప్పుకొంటూ రకరకాల ఆటలు ఆడుకూంటు ఎంజాయ్‌ చేసే సమయమీది. కానీ ఆ చిన్నారిని మృత్యువు వెంటాడింది. పదిహేనేళ్లు నిండకుండానే కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

కరోనా వైరస్‌ కారణంగా తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. విద్యాసంస్థలు, అన్ని షాపులు సైతం మూసివేసింది ప్రభుత్వం. దీంతో ప్రతీ ఒక్కరు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఆడుకుంటున్న ఓ చిన్నారిని మృత్యువు వెంటాడింది. ఊయలలో ఊగుతున్న బాలిక ప్రాణాలు పోయాయి.

వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పబ్బతి నర్సయ్య, సరోజ దంపతులకు 14 ఏళ్ల దివ్య అనే కుమార్తె ఉంది. పాఠశాలకు సెలవు కావడంతో ఇంట్లోనే ఉంటోంది. సరదాగా ఉయలలో ఊగుదామని అనుకున్న దివ్యకు మృత్యువు వెంటాడింది.

నిన్న సాయంత్రం ఇంట్లో దూలానికి చీరతో కట్టిన ఊయలలో ఊగుతుండగా.. చీరతో ఉన్న చున్నీ దివ్య మెడకు చుట్టుకుంది. దీంతో దివ్య ఊపిరాడక మరణించింది. ఆ సమయంలో తల్లి ఇంట్లో పనులు చేసుకుంటోంది. కాగా, ఈ విషయాన్ని దివ్య తల్లి గుర్తించలేకపోయింది. ఇంతలోనే తల్లి దివ్యను పిలిచింది. ఎంతకూ దివ్య పలకకపోవడంతో అనుమానం వచ్చి చూసేసరికి కూతురు ఊయాలలోనే విగత జీవిగా పడిపోయింది. ఊయలలో చిక్కుకున్న కుమార్తెను కిందికి దించింది. అప్పటికే దివ్య చనిపోయింది. దీంతో తల్లి కన్నీరుమున్నీరైంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it