పోలీసులకు చిక్కిన దెయ్యాలు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Nov 2019 11:10 AM ISTబెంగళూరు: పేరు ప్రతిష్టలు, బాగా డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాలి. అయితే యువతలో కష్టపడకుండానే అన్నీ తమ దగ్గరికి వచ్చేయాలన్నా ఆశ పెరిగిపోయింది. దీనికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నారు. ఏదో ఒక వెరైటీ పని నలుగురికి తెలిసేలా చేస్తే ముందు పేరు, తర్వాత డబ్బు వచ్చేస్తాయని ఆశపడుతున్నారు. ఎదుటి వాళ్ళని తమ తెలివితేటలతో బురిడీ కొట్టించి తామెంతో ఎంతో తెలివైన వాళ్ళని ఫీల్ అయిపోతున్నారు.
అచ్చంగా ఇలాగే ఆలోచించారు బెంగుళూరుకు చెందిన కొంతమంది యువకులు. నగరంలోని యశ్వంతపుర సమీపంలోని షరీఫ్ నగర్ కు చెందిన కొందరు వ్యక్తులు యూట్యూబ్‌లో ప్రాంక్ వీడియోలు చేయడానికి అలవాటు పడ్డారు. రొటీన్‌కు భిన్నంగా ఉండాలని వీరు దెయ్యం వేషాలు వేయడం మొదలుపెట్టారు. పెద్దపెద్ద గోళ్లు, తెల్ల బట్టలు, ఒంటి మీద రక్తపు మరకలతో భయంకరంగా తయారయ్యారు. నగర శివారులోని యశ్వంతపురలో రోడ్డుకు అడ్డంగా నిలుచుని వాహనదారులను భయపెట్టి వీడియోలు రికార్డ్ చేశారు. తెల్లటి గౌన్లు, రక్తపు మరకలతో ఆకస్మాత్తుగా రోడ్డు మీదకొచ్చిన వీరిని చూసి జనం హడలెత్తి పోయారు. పరిగెట్టి పారిపోయేవారు కొందరైతే, ఈ దారే వద్దంటూ మరోదారి వెతుక్కొని వెళ్ళిపోయేవారు మరికొందరు.
విసిగిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిఘా వేసి దెయ్యాల వేషంలో తిరుగుతున్న ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఒకరి మొబైల్ లో పలు వీడియోలను గుర్తించారు. అరెస్ట్ అయినవారు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న యువకులే. ప్రాంక్ లు చేయడం తప్పు లేదని అయితే ఇలా ఎదుటి వాళ్ళని భయపెట్టే, ఇబ్బంది పెట్టే విధానం మాత్రం సరికాదని పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.