ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక ప్రచారం జీహెచ్‌ఎంసీ చావుకొచ్చింది.!

By అంజి  Published on  9 Feb 2020 2:59 AM GMT
ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక ప్రచారం జీహెచ్‌ఎంసీ చావుకొచ్చింది.!

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా జాబితా (ఎన్‌పీఆర్)ల విషయంలో వివిధ రాజకీయ పార్టీలు చేపడుతున్న ఆందోళనలు, లేవనెత్తుతున్న అభ్యంతరాలు వారి మెడకే చుట్టుకోబోతున్నాయా.? జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే నిజమేనేమోననిపిస్తుంది. భవిష్యత్తులో ఎవరు ఏ సర్వే చేసినా ప్రజలు అనుమానించే పరిస్థితి వస్తోంది. అంతే కాదు ఈ విధంగా సర్వేల కోసం వస్తున్న వారిని ప్రజలు ఇబ్బందుల పాలు చేస్తున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఏ రకమైన సర్వేలూ చేపట్టేందుకు వీలు లేని పరిస్థితులు వస్తున్నాయి.

తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల జియో ఇన్ఫర్మేటిక్స్ సిస్టమ్ (జీఐఎస్) సర్వే ప్రారంభమైంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సర్వే. ఈ సర్వే ద్వారా ఇప్పటి వరకూ గృహ, మున్సిపల్ పన్నుల పరిధిలోకి రాకుండా ఉండిపోయిన ఇళ్లను గుర్తించి, వారి నుంచి పన్నులు వసూలు చేయడానికి వీలు పడుతుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీల ఆదాయం పెరుగుతుంది. నిజానికి జీహెచ్ఎంసీ జీఐఎస్ సర్వేలో నగరంలో 8,952 నిర్మాణాలు పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నాయని తేలింది. ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే. పన్నుల పరిధిలో లేకుండా ఉన్న నిర్మాణాల సంఖ్య ఇంకా చాలా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కానీ సీఏఏ, ఎన్ఆర్‌సీల విషయంలో జరుగుతున్న ప్రచారం కారణంగా చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా సర్కిళ్లలో ప్రజలు సర్వేను అడ్డుకున్నారు. సర్వేయర్లపై దాడులు చేయడానికి ప్రయత్నించారు. వారిపై తిట్ల వర్షం కురిపించారు. భవనాలను ఫోటోలు తీసేందుకు ప్రయత్నిస్తే నిరోధించారు. దీనితో ఇప్పుడు ఈ సర్వేకు వెళ్తున్న అధికారులకు పోలీసు భద్రతను ఇవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అంతే కాదు ఈ సర్వే వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించేందుకు జీహెచ్ఎంసీ పూనుకుంది.

ఈ మధ్యకాలంలో నగరంలోని అక్రమ కట్టడాలను గుర్తించేందుకు జీహెచ్ఎంసీ ఒక డ్రోన్ సర్వేను నిర్వహించేందుకు పూనుకుంది. స్థానికులు డ్రోన్ సర్వేను కూడా అడ్డుకున్నారు. స్థానిక ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రైవసీని ఇది హరిస్తుందని ఎన్నికైన ప్రజా ప్రతినిధులే ఆక్షేపించారు. దాంతో అధికారులు వెనకడుగు వేయాల్సి వచ్చింది. చివరికి జీహెచ్ఎంసీ అధికారులను సీఏఏ వంటి అంశాలపై తమ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పవద్దని కూడా అధికారులు సూచించినట్టు తెలిసింది.

మొత్తం మీద సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ ప్రచారం పుణ్యమా అని రానున్న రోజుల్లో ఏ రకమైన సర్వే నిర్వహించినా ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులే వస్తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story