హైదరాబాద్: ఒక కొత్త ఆలోచన సరికొత్త జీవితానికి నాందీ అయ్యింది. మనసున్న మనుషుల మంచితనం ఓ చిన్నారి జీవితంలో కొత్త వెలుగులు నింపింది. కేవలం ఉద్యోగ బాధ్యతలు మాత్రమే తమ బాధ్యత కాదని, సామాజిక స్పృహకూడా అందులో భాగమేనని భావించారు జీహెచ్ఎంసీ ఉద్యోగులు. కాగితాలు ఏరుకునే ఓ చిన్నారి బాలుడికి, అదికూడా దివ్యాంగుడైన ఓ నిరుపేద బాలుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించి అతని హృదయంలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. తోటి ఉద్యోగులకు, సమాజానికి ఆదర్శంగా నిలిచారు.

జీహెచ్ఎంసీ చందానగర్ డివిజన్‌లో చిన్నారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్. విధి నిర్వహణలో, చెత్తను మోసుకెళ్లే వ్యాన్ డ్రైవర్ రాజు ఆయనను కలిశాడు. ఆ సమయంలోనే మనుసును పిండేసే ఒక దృశ్యం ఈఈ కంటపడింది. 14 సంవత్సరాల వయసున్న హేమంత్ ఒక కాలు, ఒక చెయ్యీ లేకపోయినా చెత్తను ఏరుకుంటూ కనిపించాడు. పిల్లాడు పడుతున్న కష్టాన్ని చూసిన చిన్నారెడ్డికి గుండె తరుక్కుపోయింది. ఎలాగైనా సరే తాను చేయగలిగిన స్థాయిలో ఆ పిల్లాడికి సాయం చేయాలన్న గట్టి సంకల్పం ఆయన మనసులో ఆ క్షణానే నాటుకుంది. కాకతీయ హాస్పిటల్ సిబ్బందిన సంప్రదించి, వారి సాయంతో ఆ బాలుడికి కృత్రిమ అవయవాలను అమర్చేలా చేశారాయన. అంతటితో ఆగకుండా ఆ చిన్నారిని మియాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.

కాగితాలు ఏరుకునే దివ్యాంగుడైన ఒక నిరుపేద బాలుడిని ఈఈ చందానగర్ బృందం గుర్తించి కొత్త జీవితాన్నిచ్చింది. కాకతీయ హాస్పిటల్ ఆధ్వర్యంలో తనకు కృత్రిమ చేతిని అమర్చి, పాఠశాలలో చేర్చారు. జీహెచ్‌ఎంసీ బృందానికి, హాస్పిటల్‌కు అభినందనలు.

చిన్నారెడ్డి మాటల్లోనే ఆయన భావాల్ని చదివే ప్రయత్నం చేద్దాం… నేను అక్కడికి వెళ్లేటప్పటికి ఆ పిల్లవాడు తన తండ్రికి సాయం చేస్తున్న దృశ్యం కనిపించింది. ఒక చెయ్యీ ఒక కాలు లేకపోయినా, తనకున్న లోపాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా ఆ పసివాడు పనిచేస్తున్నాడు. తను ప్రతిరోజూ అలాగే తండ్రికి సాయం చేయడానికి వస్తాడన్న విషయం తెలిసింది. ఎందుకో నాకు ఆ నిమిషంలోనే తనకు సాయం చేయాలని అనిపించింది.

చిన్నారెడ్డి ఆలోచనకు తక్కిన సిబ్బంది కూడా తోడై రూపాన్ని కల్పించారు. మియాపూర్ లోని కాకతీయ హాస్పిటల్ యాజమాన్యం ఆ పిల్లాడికి కృత్రిమ అవయవాలను పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. జీహెచ్ఎంసీ సిబ్బంది హేమంత్‌ని హయత్ నగర్‌లోని వేగ్నేయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న దివ్యాంగుల పాఠశాలలో చేర్పించారు.

హేమంత్ తండ్రి రాజు ఇదంతా జరుగుతుందని కలలోకూడా అనుకోలేదు.  కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో ఉన్న తమ స్వగ్రామంలో హేమంత్ ఐదో తరగతివరకూ చదువుకున్నాడని తండ్రి రాజు చెబుతున్నాడు. ఉపాధికోసం మియాపూర్‌కి వచ్చిన తర్వాత తనను పాఠశాలకు పంపలేకపోయామన్నాడు. ఇంత కాలానికి మళ్లీ మంచి రోజులు రావడం, తన కొడుకుని జీహెచ్ఎంసీ అధికారులు ఆదుకోవడం, కొత్త జీవితాన్నివ్వడం అంతా ఏదో కలలాగా గడిచిపోయిందని హేమంత్ తండ్రి రాజు ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.