నవంబర్‌ రెండో వారంలో GHMC ఎన్నికల నోటిఫికేషన్‌: కేటీఆర్‌

By సుభాష్  Published on  29 Sept 2020 2:19 PM IST
నవంబర్‌ రెండో వారంలో GHMC ఎన్నికల నోటిఫికేషన్‌: కేటీఆర్‌

హైదరాబాద్‌ గ్రేటర్‌ ఎన్నికల నగారా మోగనుంది. నవంబర్‌ రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. నవంబర్‌ రెండో వారం తర్వాత ఏ క్షణంలోనైనా గ్రేటర్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం నగర ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో కేటీఆర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు చేశారు.

ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉండాలని కేటీఆర్‌ సూచించారు. కాగా, గ్రేటర్‌లో 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగా లేదని సర్వేలో తేలిందని, ఇప్పటికైనా ఆ కార్పొరేటర్లు పనితీరు మార్చుకోవాలన్నారు. కార్పొరేటర్లకు సమస్యలుంటే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ అభివృద్దికి ఇప్పటి వరకు రూ.60 వేల కోట్లు వెచ్చించినట్లు చెప్పారు.

కార్పొరేట్లు నిత్యం ప్రజల్లో ఉండాలని, ప్రతి గల్లీ తిరిగి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. అవసరమైతే గ్రేటర్‌ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి కార్పొరేటర్‌ మూడువేల గ్రాడ్యుయేట్‌ ఓట్లు నమోదు చేయించాలని అన్నారు. అక్టోబర్‌ 1న ప్రజాప్రతినిధులు అందరూ ఓటు నమోదు చేసుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

వచ్చే ఏడాది బల్దియా పాలక మండలి కాలపరిమితి ముగియనుంది. అందువల్ల ఆలోపే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రేటర్‌లోని మొత్తం 150 డివిజన్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పోలింగ్‌ నిర్వహించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను సైతం ప్రారంభించారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కమిషన్‌ లోకేశ్‌ కుమార్‌ ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. అదే విధంగా జోన్ల వారీగా నోడల్‌ ఆఫీసర్లను నియమించారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్యాలెట్‌ ద్వారానే ఓటింగ్‌ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈవీఎంల వినియోగం వల్ల తలెత్తే పరిణామాలపై నిపుణులతో అధికారులు చర్చలు సమాచారం.

బ్యాలెట్‌ వైపే మొగ్గు

కాగా, అన్ని రాజకీయ పార్టీలు కూడా బ్యాలెట్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈవీఎంలతో నిర్వహిస్తే కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉందని వివిధ పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఇక అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ బ్యాలెట్‌ పేపర్‌ ద్వారానే పోలింగ్‌ నిర్వహించాలని ఈసీని కోరింది. కరోనా వైరస్‌ కారణంగా ఈవీఎంల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Next Story