హాస్పిటల్ లోనే పెళ్లి..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Nov 2019 10:30 AM ISTపెళ్లి చేసుకోవాలి అంటే ముందు చేయాల్సిన పని మంచి కళ్యాణ మండపాన్ని వెతుక్కోవడం, దానిని అందంగా డెకరేట్ చేయించుకోవటం. కానీ ఆలియా, మైకేల్ థామస్లకు అలా ఆలోచించేంత అవకాశమే రాలేదు. 2 సంవత్సరాల క్రితం వారికి వివాహం నిశ్చయమైంది. అయితే కుటుంబ సభ్యుల మరణాలు మరియు ఇతర కారణాలతో వివాహం రెండు సార్లు వాయిదా పడింది.
ముచ్చటగా మూడోసారి వీళ్ళు వివాహానికి తేదీ నిర్ణయించుకున్నారు. అనుకోకుండా మైకేల్ తండ్రి ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో పెళ్లిని వాయిదా వేయకుండా, ఆ పెళ్ళికి తండ్రి తప్పకుండా ఉండాలని మైకేల్ ఆలియాతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆసుపత్రి సిబ్బంది, పాస్టర్లు అంగీకారంతో తండ్రి హాస్పిటల్ రూమ్ నే కళ్యాణ వేదికగా చేసుకున్నాడు.
ఆలియా మైకేల్ ఇద్దరూ హాస్పిటల్లో ధరించే లైట్ బ్లూ గౌన్ లు, చేతులకు గ్లౌజ్స్ ధరించి ఉంగరాలు మార్చుకున్నారు. పెళ్లికి అక్కడి సిబ్బంది ఆనందంగా సహకరించారు. ఇక అక్కడి డాక్టర్ కేక్ తెప్పించి ఇద్దరిచేతా కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి అంటూ అనవసర ఆర్భాటాలకు పోకుండా చక్కగా కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్న ఈ విదేశీ జంటను చూసి నెటిజన్లు ఫిదా అవుతారు.