కరోనా ఎఫెక్ట్.. మూడు నెలలు గ్యాస్ సిలిండర్లు ఉచితం
By తోట వంశీ కుమార్ Published on 8 April 2020 9:53 PM ISTకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి భారత్‌లో రోజు రోజుకు విజృంభిస్తోంది. దీంతో ఈ మహమ్మారి కట్టడికి కేంద్రం దేశవ్యాప్త లాక్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో చాలా మందికి ఉపాధి కరువైంది. రెక్కాడితే కానీ డొక్కాడని నేపథ్యంలో ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఇది అందరి కాదండోయ్ కేవలం ‘పీఎం ఉజ్వల’ పథకం లబ్ధిదారులకు మాత్రమే. ఏప్రిల్ నుంచి జూన్ 3 వరకు మూడు నెలల పాటు నెలకు ఒకటి చొప్పున గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు. దీని ద్వారా 8 కోట్ల మంది లబ్దిపొందనున్నారు.
ఏప్రిల్ నుంచి జూన్ 3 వరకు పీఎం ఉజ్వల పథకం కింద లబ్దిదారులకు ప్రతి ఒక్కరికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ట్విట్టర్ లో తెలిపారు.
ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందాలంటే..
* ప్రధాన మంత్రి ‘గరీబ్ కల్యాణ్ పథకం’లో భాగమై ఉండాలి.
* లబ్ధిదారుల వివరాల మేరకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు సిలిండర్ల ధర (ప్రాంతాలను బట్టి మారుతుంది) బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు.
* బ్యాంకులో డబ్బు జమ చేశాక ఫోన్ లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి.
* ఎవరి మొబైల్ నెంబర్లయినా లింక్ కాకపోతే..గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి ఆధార్ కార్డును తీసుకెళ్లి నమోదు చేయించుకోవాలి.
* నేరుగా ఇంటికి గ్యాస్ సిలిండరు సరఫరా చేస్తారు.
* ఈ సమయంలో గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి ఒక దరఖాస్తు తీసుకొస్తారు. అందులో తమకు సిలిండర్ అందినట్లు లబ్ధిదారు ధృవీకరణ చేయాలి.
* మొబైల్ కి వచ్చే ఓటీపీని ఇందులో పొందు పర్చాలి.
కేంద్ర ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనుంది. ముందుగానే నగదును బ్యాంకులో జమ చేస్తోంది కనుక సిలిండర్లు తీసుకోకపోయినా ఏం కాదులే అని అనుకుంటున్నారా..? అయితే జాగ్రత్త.. మొదటి నెల గ్యాస్ సిలిండర్ తీసుకున్నట్లయితే.. రెండో విడుత గ్యాస్ సిలిండర్ సొమ్ము బ్యాంకులో జమ అవుతుంది. లేకుండా జమ కాదు. మూడో విడుత నగదును కోల్పోవాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాలోనే సొమ్ము జమ చేస్తున్నందున గ్యాస్ ఏజెన్సీలకు డిజిటల్ పద్ధతిలోనే ఆన్‌లైన్ పేమెంట్ చేయాలని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే 15 రోజులకు ఒకటి తీసుకొనే వెసులుబాటు కూడా ఉంది. ఎలా తీసుకున్నా కేవలం మూడు సిలిండర్లు ఉచితంగా అందుతాయి.