ఆమె జానపదానికి జనం ఫిదా.!

By అంజి  Published on  4 Feb 2020 3:03 AM GMT
ఆమె జానపదానికి జనం ఫిదా.!

ఎవరైనా బాగా పాడితే వారిని మెచ్చుకుంటాం.. మహా అయితే సన్మానిస్తాం, కొందరు అభిమానంతో డబ్బులు ఇస్తారు. గుజరాత్‌లో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో పాట పాడుతున్న జానపద గాయనిపై అక్కడి ప్రజలు నోట్ల వర్షం కురిపించారు. పాప్ సింగర్స్‌కి సమానంగా ఈమెకి ఫాలోవర్స్ ఉన్నారు. అందుకేనేమో గీతా రబారి అనే ఈ జానపద గాయని పాడిన ఓ పాటకు ఇండియన్ కరెన్సీతో పాటు డాలర్ల వర్షం కురిసింది.

గుజరాత్‌లోని నవసారి జిల్లా చిట్లీ తాలుకా వన్జనా గ్రామంలో ఇది జరిగింది. భజన్‌ సంధ్య పేరుతో ఆధ్యాత్మిక పాటలతో స్థానికంగా ఉండే ఓ ట్రస్ట్‌ జానపద గాయని గీతా రబారీ సంగీత విభావరి ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో ఆమె పాటకు ముగ్ధులైన జనం గీతా రబారీపై నోట్ల వర్షం కురిపించారు. ఆమెపై కురిసిన ఈ నోట్ల విలువ లక్షల్లో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. పది రూపాయల నోట్ల నుంచి రెండు వేల రూపాయల నోట్లు ఆమెపై వెదజల్లారు. అలా కురిసిన నోట్లలో అమెరికన్‌ డాలర్లు కూడాఉన్నాయి.

 Geeta rabari song

కార్యక్రమం ముగిసిన తర్వాత నోట్లను లెక్కిస్తే రూ.8 లక్షలు వరకు ఉన్నట్లు తేలింది. అయితే ఈ మొత్తాన్ని పిల్లల చదువు, ఉచిత ఆహార కేంద్రాన్ని నడిపించటం సహా గిరిజన యువతులకు వివాహం జరిపించేందుకు ఉపయోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ జానపద గాయని ఇటీవలే ప్రధాని మోదీని కలిశారు. ఆయన పిలుపు మేరకు స్వచ్చ భారత్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Geeta rabari song

గుజరాత్‌ కచ్‌ జిల్లాలోని తప్పర్‌ గ్రామంలో అటవీ ప్రాంతంలో నివసించే మాల్దారి తెగకు చెందిన అమ్మాయి గీత. ఆమె అమ్మానాన్నలు పాల వ్యాపారం చేసేవాళ్లు. ఆడపిల్లల్ని వారి తెగలో బడికి పంపించేవారు కాదు. అయితే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాల స్ఫూర్తితో ఆలస్యంగానైనా బడి మెట్లు ఎక్కింది గీత. ఆమెకు పాటలంటే ఇష్టం. వెరైటీ గొంతుతో స్థానిక జానపదాలను అయిదో తరగతి నుంచే పాడడం మొదలెట్టింది. కొద్ది కాలంలోనే ఆమె పాటల ప్రతిభ చుట్టుపక్కలా ఊళ్లకు తెలిసింది. దాంతో గీతను వేడుకలు, ఇతర సందర్భాల్లో పాడేందుకు ఆయా గ్రామాలవారు ఆహ్వానించేవారు. అలా భజనలు, జానపద గీతాలు, పాడుతూ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. పాటల్లోనే కాదు, వేషధారణలోనూ జానపదం కొట్టొచ్చినట్టు కనిపించడంతో కోట్లాది మంది ఆమె పాటలకు ఫిదా అయ్యారు. మోదీని తండ్రిగా భావించే గీత ఆయన మీద పాడిన ‘రన్‌ శర్మ’ పాట బాగా క్లిక్‌ అయింది. ఆ పాటను యూట్యూబ్‌లో 25 కోట్ల మందికి పైగా చూశారు.

Geeta rabari song

Next Story