7నిమిషాల్లోనే కోచ్‌నయ్యా: గ్యారీ క్రిస్టన్
By తోట వంశీ కుమార్ Published on 16 Jun 2020 11:39 AM ISTభారత క్రికెట్ చరిత్రను ఓ ఏడు నిమిషాలు మార్చేసింది, కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల కళను సాకారం చేసిన ద్రోణాచార్యుడు అతడు. అతడే భారత జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్. 2007లో టీమ్ ఇండియా ప్రపంచకప్ లో ఘోరంగా ఓడిపోయింది. త్రిమూర్తులు సచిన్, గంగూలి, ద్రావిడ్ లు ఉన్న బంగ్లాదేశ్ చేతిలో ఓడి ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది. అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్ వల్ల జట్టు సభ్యుల మధ్య సఖ్యత లేదు అనే వార్తలు వినిపించాయి. విభజించూ పాలించు అనే సూత్రంతో చాపెల్ జట్టును నడిపించాడని అంటారు.
అదే సంవత్సరంలో ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌లో త్రిమూర్తులు లేకుండానే భారత జట్టు పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే.. ఆ జట్టులో అంతా యువకులే. పొట్టి ఫార్మట్ లో అయితే రాణించారు కానీ.. 50ఓవర్లు, టెస్టుల ఫార్మాట్‌లో రాణించాలంటే చాలా కష్టం అని అందరికి తెలుసు. అప్పుడే భారత జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టన్. అయితే.. అప్పటికి అతడికి కోచింగ్ లో అనుభవం లేదు.
అప్పుడు గ్యారీని చూసి చాలా మంది నవ్వారు. హేమా హేమీల వల్లే కాలేదు. ఇతడి వల్ల ఏం అవుతుందని చాలా మంది అన్నారు. ఓ నాలుగు తిరిగే సరికి అతడే.. అత్యుత్తమ కోచ్ అయ్యాడు. టెస్టుల్లో భారత్ నెంబర్ వన్ ర్యాంకును సాధించడంలో, 2011లో భారత జట్టు ధోని సారధ్యంలో రెండో సారి ప్రపంచ కప్ ను ముద్దాడడంతో అతడి పాత్ర ఎంతో ఉంది. భారత జట్టును ముందుండి ధోని నడిపిస్తుంటే.. వెనక ఉండి కృష్ణుడిలా గీతోపదేశం చేసింది కిర్‌స్టన్ నే.
అయితే.. అతడు భారత జట్టు కోచ్ గా ఏడు నిమిషాల్లో ఎన్నికైయ్యాడట. కోచింగ్ అంటే ఇష్టం లేకున్నా.. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోకున్నా కూడా. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు కిర్‌స్టన్. టీమ్ ఇండియాకు కోచింగ్ ఇవ్వడానికి ఆసక్తి ఉందా..? అంటూ సునీల్ గవాస్కర్ నుంచి ఓ రోజు మెయిల్ వచ్చింది. అయితే.. ఎవరో తనను ఆటపట్టించాలని అలా చేసి ఉంటారని అనుకున్నాను. ఆ తరువాత మరో మెయిల్ వచ్చింది. ఇంటర్వ్యూకు రమ్మని. అదే విషయాన్ని నా భార్యకు చెబితే.. ఎవరికో పంపాల్సింది నీకు వచ్చిందనుకుంటా అని ఆమె చెప్పింది. అయితే అప్పటికి తనకు ఎలాంటి కోచింగ్ అనుభవం లేదని కిర్‌స్టన్ చెప్పాడు.
ఇక ఇంటర్వ్యూ కోసం భారత్ కు వచ్చా.. బీసీసీఐ కార్యాలయంలో కి వెళ్లేటప్పుడు అప్పటి భారత కెప్టెన్ అనిల్‌కుంబ్లేను కలిశాను. ‘నువ్విక్కడేం చేస్తున్నావ్'అని కుంబ్లే ప్రశ్నించాడని, ‘మీకు శిక్షణ ఇచ్చేందకు ఇంటర్వ్యూకు వచ్చాను'అని తాను సమాధానమివ్వగానే కుంబ్లే ఓ నవ్వు నవ్వడాని చెప్పుకొచ్చాడు. ఏ మాత్రం సన్నద్దత లేకుండానే ఇంటర్వ్యూకు వెళ్లా.. భారత క్రికెట్ భవిష్యత్తు కోసం నీ ప్రణాళికలు వివరించండి అని బీసీసీఐ కార్యదర్శి అడిగాడు. అయితే.. నా ప్రణాళికేమీ లేదని, అలాంటి ప్రణాళికతో రమ్మని ఎవరూ చెప్పలేదని చెప్పాను. అయితే... అప్పుడు ప్యానెల్ మెంబర్‌గా రవిశాస్త్రి ఉన్నాడు. వెంటనే భారత్‌ను ఓడించడానికి దక్షిణాఫ్రికా జట్టు ఏం చేసిందో చెప్పండి అని అడిగాడు. అయితే.. మేం అనుసరించిన వ్యూహాల గురించి చెప్పకుండా మూడు నిమిషాల పాటు జవాబు చెప్పా. నేను చెప్పిన జవాబు అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది. వెంటనే తనకు బోర్డు కాంట్రాక్టు పత్రాలను ఇచ్చింది. ఇదంతా కేవలం 7 నిమిషాల్లోనే ముగింసిందని కిర్‌స్టన్ తెలిపాడు. 2009లో టీమ్ ఇండియా టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి, 2011 లో ప్రపంచకప్‌ను గెలుచుకోవడంలో కిర్‌స్టన్ పాత్ర ఎంతో ఉంది.
2008 నుంచి 2011 వరకు భారత జట్టుకు కోచ్‌గా పనిచేశాడు కిర్‌స్టన్. అతడి కోచింగ్‌లో టీమ్‌ఇండియా ఎన్నో విజయాలు అందుకుంది. సక్సెస్ పుల్ కోచ్‌గా మారాడు. పదవికాలం ముగిసిన అనంతరం మరోసారి కాంట్రాక్టు పొడిగించేందుకు బీసీసీఐ సిద్దమైన ఎందుకనో కిర్‌స్టన్ సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. గ్యారీ తరువాత డంకన్ ఫ్లెచర్ భారత జట్టు కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు.