వైసీపీలోకి గంటా శ్రీనివాస్‌..ముహూర్తం ఖరారైందా..?

By సుభాష్  Published on  24 July 2020 2:38 AM GMT
వైసీపీలోకి గంటా శ్రీనివాస్‌..ముహూర్తం ఖరారైందా..?

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ కూడా ఇచ్చారని పార్టీ ముఖ్యనేతల ద్వారా సమాచారం. ఎన్నికల ముందు నుంచే వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మర ప్రయత్నాలు చేసినా.. అది కుదరలేదని నేతలు చెబుతున్నారు. అయితే గంటా తరుచుగా నియోజకవర్గాలు మార్చే అలవాటు ఉంది. 2019లో భీమిలి నియోజకవర్గాన్ని వీడి నార్త్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గంటా టీడీపీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. కానీ ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గంటా వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. అయితే ఇటీవల కూడా ఎన్నో సార్లు గంటా శ్రీనివాస్‌ వైసీపీలో చేరబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఒక సమయంలో కూడా టీడీపీని వీడే అవకాశం లేదని చెప్పిన గంటా.. తాజాగా వైసీపీలోకి వచ్చేందుకు సముఖంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల విశాఖ పర్యటన సమయంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డిని తరచూ గంటా శ్రీనివాస్‌పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు గంటాను ఉద్దేశించి ట్వీట్లు కూడా చేశారు. ఇందుకు తోడు విశాఖ కు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్‌ కూడా గంటా శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా ఉండటంతో ఆయన వైసీపీలోకి రావడానికి అడ్డంకిగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల వైసీపీ శిబిరంలో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తున్న నేతలూ.. శిబిరంలో ముఖ్యమైన నేతలు గంటాను వైసీపీలోకి వచ్చేందుకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని చెబుతున్నారు. ఇప్పటికే జగన్‌ పార్టీలో చేరేందుకు మంతనాలు కూడా జరిపినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ విషయమై గంటా శ్రీనివాస్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు. ఇప్పటికే ఎన్నోసార్లు వైసీపీలో చేరుతున్నారన్న వస్తున్న వార్తలపై ఇప్పుడైన నిజం అవుతుందా.. లేదా అనేది వేచి చూడాలి.

Next Story