వేములవాడలో గ్యాంగ్‌వార్
By న్యూస్‌మీటర్ తెలుగు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ గ్యాంగ్ వార్ ఘటన మరవకముందే.. తాజాగా నిన్న వేములవాడలో మరో గ్యాంగ్ వార్ ఘటన చోటుచేసుకుంది. గొడవకు పెద్ద కారణం లేకుండానే యువకులు రెండు గ్యాంగ్‌లుగా విడిపోయి.. మండల పరిషత్తు కార్యాలయం ఎదుట నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. వారి గొడవ చూసిన ప్రజలు భయంతో హడలిపోయారు. దాదాపుగా 20 నిముషాల పాటు యుద్దభూమిని తలపించిన వారి పోరును పోలీసులు చిత్రీకరించారు. ఒకరిపై ఒకరు అందుబాటులో ఉన్న రాళ్ళూ రప్పలు విసురుకుంటూ గందరగోళం సృష్టించారు.
బైక్‌పై మితిమీరిన వేగంతో వెళ్తున్నాడని యువకుడిని మందలించడంతో.. కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు వెళ్లి తన మనుషులను తీసుకొచ్చాడు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. 20 నిమిషాల పాటు సాగిన ఈ గొడవను చూసిన వేములవాడ పట్టణ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.