గాంధీ ఆస్పత్రి వివాదంపై మంత్రి ఈటల సీరియస్‌

By అంజి  Published on  15 Feb 2020 12:32 PM GMT
గాంధీ ఆస్పత్రి వివాదంపై మంత్రి ఈటల సీరియస్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వివాదంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సీరియస్‌ అయ్యారు. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించమన్నారు. డాక్టర్‌ స్థాయిలో ఉన్న వసంత్‌ ఆత్మహత్యకు ప్రయత్నంచడం సరికాదన్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే తగిన చర్యలుంటాయని మంత్రి ఈటెల పేర్కొన్నారు. వ్యక్తుల కంటే వ్యవస్థే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. తాను ఉన్నది.. అక్రమాలు జరుగుతుంటే చూసుకుంటూ ఉరుకోవడానికి కాదన్నారు. ఇలాంటి సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామని మంత్రి ఈటల అన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ యోగితా రానా, సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

కాగా గాంధీ ఆస్పత్రిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. గాంధీలోని శానిటేషన్‌, సెక్యూరిటీ విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని, కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని డాక్టర్‌ వసంత్‌కుమార్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తనను సరెండర్‌ చేశారని వసంత్‌ చెప్పిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా ఆస్పత్రిలో బయోమెట్రిక్‌ సిస్టమ్‌ పని చేయడం లేదని.. దీంతో ఆస్పత్రి సిబ్బంది విధుల్లోకి రాకుండానే వేతనం దండుకుంటున్నారని వసంత్‌ ఆరోపణలు చేశాడు. అయితే వసంత్‌పై కూడా పలువురు వైద్యులు ఆరోపణలు చేస్తున్నారు. గాంధీ ఘటనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. వసంత్‌ ఆరోపణలపై ఆ కమిటీ విచారణ జరుపుతోంది.

Next Story
Share it