8 ఏళ్లు చాలా ఎక్కువ.. కోహ్లీని తప్పించాల్సిందే : గంభీర్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Nov 2020 11:17 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజల్స్ బెంగళూరు కథ ముగిసిన సంగతి తెలిసిందే. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఈ సారైనా కప్పు సాధించాలన్న ఆశను నెరవేర్చుకోకుండా ఆ జట్టు ఇంటి ముఖం పట్టింది. దీంతో కెప్టెన్ కోహ్లీపై విమర్శలు మొదలైయ్యాయి. కెప్టెన్‌గా కోహ్లీని తొలగించాని కొందరు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి మాజీ క్రికెటర్ గౌతమ్ మద్దతు పలికాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని.. ఇప్పటికైనా కెప్టెన్‌గా కోహ్లీని తప్పించాలని అభిప్రాయపడ్డాడు.
8 ఏళ్ల నుంచి ఆర్‌సీబీకి కెప్టెన్‌గా కోహ్లీ ఉన్నాడు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ అందించలేకపోయాడని విమర్శించాడు. ఏ జట్టు కెప్టెన్ అయినా ఎనిమిదేళ్ల పాటు కప్పును గెలవకుండా అదే పొజిషన్ లో కొనసాగగలడా? అని ప్రశ్నించాడు. అదే పంజాబ్‌ను చూడండి.. రవిచంద్రన్ అశ్విన్‌ను రెండేళ్లు కెప్టెన్‌గా ఉంచారు. ఫలితం లేకపోవడంతో తప్పించారు. ఇక ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్లు ధోని, రోహిత్ శర్మ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. రోహిత్ ముంబైకి నాలుగు సార్లు, ధోని చెన్నైకి మూడు సార్లు టైటిల్‌ను అందించారని.. వీరిద్దరి సరనన కోహ్లీని చేర్చలేమని చెప్పాడు.
ఇక ఆర్‌సీబీ ఎక్కువగా కోహ్లీ, డీవిలియర్స్ ల పైనే ఆధారపడుతోందని.. సమిష్టిగా రాణించినప్పుడే టైటిల్ గెలిచేందుకు అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. గెలిచినప్పుడు క్రెడిట్ పొందేవారు.. ఓడినప్పుడు విమర్శలను కూడా స్వీకరించాలన్నాడు. ఏ సమస్య ఉన్నా, ఏ భాద్యత అయినా.. కెప్టెన్ నుంచే మొదలవ్వాలి. అది జట్టు యాజమాన్యం లేదా ఇతర సిబ్బంది నుంచి కాదని గంభీర్ పేర్కొన్నాడు.