కోహ్లీ కెప్టెన్ ఉంటే బెంగ‌ళూరుకు క‌ప్‌ రాదు.. అభిమానుల ఆగ్ర‌హాం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2020 9:15 AM GMT
కోహ్లీ కెప్టెన్ ఉంటే బెంగ‌ళూరుకు క‌ప్‌ రాదు.. అభిమానుల ఆగ్ర‌హాం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ క‌థ ముగిసింది. ప్ర‌తి సీజ‌న్‌కు ముందు క‌ప్పు మ‌న‌దే అని రావ‌డం చివ‌రికి నిరాశ‌నే వెనుదిర‌గ‌డం బెంగ‌ళూరుకు అల‌వాటుగా మారింది. శుక్ర‌వారం రాత్రి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ఆ జ‌ట్టు ప‌రాజ‌యం పొందింది. దీంతో మ‌రోసారి రిక్త‌హ‌స్తాల‌తోనే యూఏఈ నుంచి కోహ్లీ సేన తిరుగుముఖం ప‌ట్టింది.

అబుదాబి వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 131 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఏబీ డివిలియర్స్‌ (43 బంతుల్లో 56; 5 ఫోర్లు), ఫించ్‌ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం ఛేద‌న‌కు దిగిన‌ హైదరాబాద్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని చేరుకుంది. ‘మ్యాన్‌‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కేన్‌ విలియమ్సన్‌ (44 బంతుల్లో 50 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జేసన్‌ హోల్డర్‌ (20 బంతుల్లో 24 నాటౌట్‌; 3 ఫోర్లు) లు స‌మిష్టిగా రాణించి స‌న్‌రైజ‌ర్స్‌కు విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 47 బంతుల్లో 65 పరుగులు జోడించడం విశేషం.

ఓటమి అనంతరం ఆ జట్టుపై బెంగళూరు అభిమానులు విరుచుకుపడ్డారు. బెంగళూరు జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా ఉండగా కప్పు సాధించడం అసాధ్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టుకు కూడా కోహ్లీ పెద్దగా సాధించినదేమీ లేదని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. నిన్నటి మ్యాచ్ అనంతరం కోహ్లీ తన జట్టుతో కలిసి తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒడిదొడుకుల సమయంలోనూ జట్టు సమష్టిగా ఉందని, ఒక బృందంగా ఈ ప్రయాణం చాలా గొప్పగా ఉందని అన్నాడు. పరిస్థితులు తమకు అనుకూలంగా లేవన్నది నిజమే అయినా తమ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని అన్నాడు. తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన కోహ్లీ.. త్వరలోనే మళ్లీ అభిమానుల ముందుకు వస్తామని పేర్కొన్నాడు.

Next Story