గల్వాన్ లోయలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే టెన్షన్ తప్పదు

By సుభాష్  Published on  23 Jun 2020 6:29 AM GMT
గల్వాన్ లోయలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే టెన్షన్ తప్పదు

భారత్ - చైనాల మధ్య కొత్త ఉద్రిక్తలకు తెర తీసిన గల్వాన్ లోయ దగ్గర చోటు చేసుకున్న పరిణామాల ప్రభావం ఇప్పట్లో తొలిగేలా కనిపించట్లేదు. లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న పెట్రోలింగ్ పాయింట్ 14 (పీపీ14) వద్దా.. పాంగాంగ్ టీఎస్ వో వద్దా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందన్నది ప్రశ్న. యావత్ దేశాన్ని కదిలించటమే కాదు.. డ్రాగన్ దేశమంటే చాలు భారతీయులు విరుచుకుపడే పరిస్థితి.

భారత సైనికులపై దాడి చేసిన డ్రాగన్ సైనికులకు షాకిచ్చేలా భారత భద్రతాదళలు వ్యవహరించాయి. ఇరవై మంది భారత సైనికులు వీర మరణం పొందితే.. చైనాకు చెందిన సైనికుల సంఖ్య 45 వరకు ఉందన్న మాట నిజమేనన్న వైనం ఇటీవల కాలంలో వచ్చిన రిపోర్టుల్ని చూస్తే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పీపీ 14 వద్ద రెండు దేశాలకు చెందిన సైనికులు పెద్ద ఎత్తున మొహరిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం వాతావరణం గంభీరంగా ఉందని.. రెండు దేశాలకు చెందిన సైనికులు భారీ ఎత్తున మొహరిస్తున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇరు దేశాలకు చెందిన వెయ్యి మంది వరకూ సైనికులు ఇప్పుడు అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే చైనా బలగాలకు బుద్ది చెప్పేలా స్పెషల్ ఆపరేషన్ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. జూన్ 15 తర్వాత ఇరు దేశాల మధ్య అక్కడ ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోలేదు. కాకుంటే.. ఇరుదేశాలకు చెందిన సైనికులు భారీ ఎత్తున మొహరించినట్లుగా తెలుస్తోంది.

దీంతో.. ఎప్పుడేం జరుగుతందో అర్థం కాని అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చైనాతో భారత్ కున్న3488 కి.మీ. సరిహద్దు భాగంలో ఎక్కడా దురాక్రమణ చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా ప్రత్యేక దళాల్ని రంగంలోక దింపినట్లుగా చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే..రానున్న రోజుల్లో సరిహద్దుల్లో అనుకోని రీతిలో పరిణామాలు చోటు చేసుకున్నా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదంటున్నారు. ఏమైనా దేశ ప్రజలంతా తీవ్రమైన భావోద్వేంతో ఉండగా.. సరిహద్దుల్లో కాపలా కాచే సైనికుల పరిస్థితి మరెలా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది.

Next Story
Share it