డెలివరీకి సిద్ధంగా ఉన్న భార్య.. అమెరికాలో గజ్వేల్ వ్యక్తి హఠాన్మరణం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Feb 2020 3:49 PM GMT
డెలివరీకి సిద్ధంగా ఉన్న భార్య.. అమెరికాలో గజ్వేల్ వ్యక్తి హఠాన్మరణం

తెలంగాణ రాష్ట్రం గజ్వేల్ కు చెందిన ప్రశాంత్ కుమార్ కొమ్మిరెడ్డి అమెరికాలోని డల్లాస్ లో అమెరికన్ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తించేవాడు. బుధవారం ఉదయం ఆఫీసులో తన పనిలో నిమగ్నమై ఉండగా అతడు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. ఎమర్జెన్సీ రూమ్ లో అతడికి చికిత్స అందిస్తూ ఉండగా అతడు తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని టెర్రాంట్ కౌంటీ మెడికల్ అధికారులు ధృవీకరించారు.

ప్రశాంత్ సహోద్యోగులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రశాంత్ భార్య తొమ్మిది నెలల నిండు గర్భిణీ. ఇప్పటికే వారిద్దరికీ మూడేళ్ళ కుమార్తె కూడా ఉంది. గజ్వేల్ కు చెందిన ప్రశాంత్ ఫ్రెండ్ సంతోష్ కుమార్ తన స్నేహితుడి జీవితం ముగిసిన విషయాన్ని.. కుటుంబ సభ్యుల పరిస్థితినీ వివరిస్తూ తెలంగాణ ఐటీ మినిస్టర్ కె.టి.రామారావును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ప్రశాంత్ సోదరుడిని వీలైనంత త్వరగా డల్లాస్ కు పంపించాలని కోరాడు. వెంటనే స్పందించిన కేటీఆర్.. ఈ విషయాన్ని రీట్వీట్ చేస్తూ.. హైదరాబాద్ లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ నూ.. ఢిల్లీలోని అమెరికా ఎంబసీని ట్యాగ్ చేశారు. సాధ్యమైనంత త్వరగా ప్రశాంత్ సోదరుడికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ప్రశాంత్ సోషల్ మీడియా అకౌంట్ ను చూస్తే అతడు జెఎన్టీయు హైదరాబాద్ నుండి బీటెక్ పట్టా పొందినట్లు తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా అమెరికన్ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడానికి అతని స్నేహితులు ఆన్ లైన్ లో ఫండ్స్ రైజింగ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా 2,00,000 డాలర్లకు పైగా డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ సన్నిహితులు ఇచ్చిన సమాచారం ప్రకారం అతడు కుప్పకూలిపోయే ముందు మెడ నొప్పిగా ఉందని అన్నాడని.. 911(ఎమర్జెన్సీ నెంబర్) కు కాల్ చేశారట. దాదాపు 15 నిమిషాల వ్యవధిలోనే అతడు కుప్పకూలిపోయినట్లు చెప్పారు. ఆసుపత్రికి వెళ్లే దారిలోనే అతడి ప్రాణాలు పోయాయని అన్నారు. అతడికి ఇంతకు ముందు కూడా తల తిరగడం లాంటి సమస్యలు ఉన్నాయని.. మందులు వేసుకుంటూ ఉన్నాడని ప్రశాంత్ బంధువులు చెప్పారు. ప్రశాంత్ మరణవార్త తెలియగానే నిండు గర్భిణీ అయిన అతడి భార్య దివ్య షాక్ కు గురయ్యింది. ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె సోదరుడు నార్త్ కరోలీనాలో నివసిస్తూ ఉన్నాడని.. విషయం తెలియగానే ఆమె దగ్గరకు బయలుదేరాడు. ప్రస్తుతం ఆమె తల్లి, సోదరి అక్కడే ఉన్నారు.

Next Story