వ్యోమ మిత్ర - రోదసిలోకి వెళ్లే హ్యూమనాయిడ్ రోబో
By సుభాష్ Published on 23 Jan 2020 9:23 AM ISTభారత అంతరిక్ష పరిశోధన సంస్థ హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. దీని పేరు వ్యోమమిత్ర. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ఈ మహిళా రోబోను రూపొందించారు. ఇస్రో ఈ ఏడాది డిసెంబర్‌లో చేపట్టనున్న మానవ రహిత అంతరిక్ష యాత్రలో వ్యోమమిత్రను రోదసిలోకి పంపనున్నారు. భవిష్యత్తులో చేపట్టే మానవ సహిత యాత్రల్లో ఈ రోబో వ్యోమగాములతో పాటు వెళ్లి, వారికి సాయం అందించనుంది.
‘మానవసహిత అంతరిక్ష యాత్ర, అన్వేషణ - ప్రస్తుత సవాళ్లు, భవిష్యత్తు ధోరణులు’ అనే అంశంపై అంతర్జాతీయ వ్యోమగాముల అకాడమీ, ఇస్రో, భారత వ్యోమగామి సంస్థ సంయుక్తంగా బెంగళూరులో నిర్వహిస్తున్న సదస్సులో ఈ హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించారు. తల నుంచి నడుము భాగం వరకు మాత్రమే నిర్మితమై ఉండటంతో దాన్ని హాఫ్ హ్యూమనాయిడ్ రోబోగా పరిగణిస్తున్నారు. ఈ రోబో తనకు తానుగా సభికులకు పరిచయం చేసుకొని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సంస్కృతంలో ‘వ్యోమ’ అంటే అంతరిక్షం. ‘మిత్ర’ అంటే స్నేహితుడు. ఈ రెండు పదాల సంయుక్త రూపమే ‘వ్యోమమిత్ర’. పేరుకు తగ్గట్టే ఈ రోబో అంతరిక్షంలో వ్యోమగాములకు స్నేహితురాలిగా ఉంటుంది. వారిని గుర్తిస్తుంది. వారితో ముచ్చటిస్తుంది. ఆంగ్లం, హిందీ భాషలు మాట్లాడే సామర్థ్యం దాని సొంతం. సమర్థమైన కృత్రిమ మేధస్సు, సెన్సర్ల వ్యవస్థలతో రోబో కదులుతుంది. ఇస్రో కమాండ్ సెంటర్లతో నిత్యం అనుసంధానమై ఉంటుంది.
ఇప్పటివరకూ.. రష్యా, అమెరికా, చైనాలు మాత్రమే దేశీయంగా తయారు చేసిన రాకెట్లను ఉపయోగించి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాయి. భారతదేశం కూడా ఇలాగే చేయగలిగితే.. తన సొంత గడ్డ నుంచి మనుషులను అంతరిక్షంలోకి పంపించిన నాలుగో దేశంగా నిలుస్తుంది.
అయితే.. మనుషులను అంతరిక్షంలోకి పంపించిన ఇతర దేశాలు.. మనుషుల కన్నా ముందు జంతువులను పంపించాయి. కానీ భారతదేశం అలా చేయటం లేదు. జంతువులను కాకుండా హ్యూమనాయిడ్ రోబోలను పంపిస్తోంది. అంతరిక్షంలో దీర్ఘ కాలం పాటు ఉంటే.. అక్కడ భారరహిత స్థితి, అణుధార్మికతలు మనుషుల శరీరాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది అర్థంచేసుకోవటానికి ఈ రోబోలను పంపుతోంది.
గగనయాన్ లో భాగంగా 2021 డిసెంబర్ నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యోమనౌకలో మొట్టమొదటి భారతీయుడిని అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో ఆలోగా రెండు మానవ రహిత అంతరిక్ష యాత్రలను నిర్వగించనుంది. మొదటి ప్రయోగాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో, రెండో ప్రయోగాన్ని వచ్చే ఏడాది జూన్‌లో చేపట్టనుంది. ఈ మూడు ప్రయోగాల్లోనూ వ్యోమమిత్రను అంతరిక్షంలోకి పంపి అక్కడ కొన్ని గురుత్వాకర్షణ ప్రయోగాలు చేపట్టనున్నారు.
గగన్‌యాన్ అనేది మొట్టమొదటి భారతీయుడిని అంతరిక్షంలోకి పంపే మిషన్ మాత్రమే కాదని.. రోదసిలో ప్రత్యేకంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని (స్పేస్ స్టేషన్) నిర్మించాలన్నదే తమ అంతిమ లక్ష్యమని ఇస్రో చీఫ్ శివన్ తెలిపారు.