మానవ యంత్రాలకు మారుతున్న హార్ట్ బీట్

By Newsmeter.Network  Published on  14 Jan 2020 2:17 PM GMT
మానవ యంత్రాలకు మారుతున్న హార్ట్ బీట్

  • రాత్రింబవళ్లూ మీరు పనికే అంకితమయ్యారా?
  • సంపాదనే ధ్యేయంగా బతుకుతున్నారా?
  • చిన్నచిన్న సంతోషాలకు దూరమయ్యారా?
  • అవసరాలకోసం అన్నింటినీ వదులుకుంటున్నారా?
  • పూర్తిగా పని యంత్రాలుగా మారిపోయారా?
  • అనుక్షణం ఒత్తిడిని అనుభవిస్తున్నారా?
  • అయితే కచ్చితంగా మీకు ముప్పు తప్పదు
  • మీ హార్ట్ బీట్ వేగం పూర్తిగా మారిపోతుంది
  • దానివల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ

రాత్రింబవళ్లూ మీరు పనికే అంకితమయ్యారా? కేవలం డబ్బు సంపాదనమీదే పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారా? జీవితంలో చిన్న చిన్న సంతోషాలకుకూడా దూరంగా బతుకుతున్నారా? జీవితం సాఫీగా గడవడానికి కావాల్సిన అవసరాలకోసం సంపాదనే ధ్యేయంగా, ఏకైక లక్ష్యంగా జీవిస్తున్నారా? పని యంత్రాలుగా మారి అనుక్షణం ఒత్తిడిని అనుభవిస్తున్నారా? అయితే కచ్చితంగా మీకు ముప్పు తప్పదు.

తాజా అధ్యయనాలు తేటతెల్లం చేసిన నిజాలను గురించి తెలుసుకుంటే మీ గుండె ఒక్క నిమిషం కొట్టుకోవడం మానేసి మళ్లీ వెంటనే వేగంగా పరిగెడుతుంది. అవును నిజమే. అలా పరిగెత్తే గుణం దానికి అలవాటై పోతుంది. ఒక రోజుకి పూర్తిగా మీ హార్ట్ బీట్ రేట్ పూర్తిగా మారిపోతుంది. అప్పుడు మీరు నిజంగా మానవ యంత్రమై పోతారు.

పనికి మాత్రమే పూర్తిగా అంకితమైపోయి మానవ యంత్రాలుగా మారిపోయిన మనుషులు సమకాలీన సమాజంలో మనకు చాలామందే కనిపిస్తారు. అలాంటివారికి వయసు పెరిగిన తర్వాత అనేక రకాలైన అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటివారికి ముసలితనం వచ్చిన తర్వాత గుండెకు సంబంధించిన అనేక రకాలైన సమస్యలు తప్పవని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

పదకొండువేల మందిపై పాతికేళ్లుగా జరిపిన లోతైన పరిశోధనల్లో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. నిరంతరం ఒత్తిడితో కూడుకున్న పని చేసే వాళ్లకు మిగతా వ్యక్తులతో పోలిస్తే ఈ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. సామాన్యమైన భాషలో చెప్పుకోవాలంటే మొత్తం పూర్తిగా పని యంత్రాలుగా మారిన వాళ్లకు గుండె కొట్టుకునే వేగంలోకూడా చాలా మార్పు వచ్చి తీరుతుందట.

ఇలాంటి వాళ్లకు హార్ట్ అటాక్ లకు, స్ట్రోక్ లకు తట్టుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కొద్దోగొప్పో తట్టుకునే శక్తి ఉన్నప్పటికీ వీళ్లు హార్ట్ అటాక్ వల్లగానీ, స్ట్రోక్ వల్లగానీ బాధపడే స్థాయి చాలా ఎక్కువగా ఉంటుందట. పని చేసే చోట ఎదురయ్యే తీవ్రమైన ఒత్తిడిని నియంత్రించుకోలేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యను ఎదుర్కుంటున్నావారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది.

యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా వైద్య బృందాలు దీనిపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేశాయి. ఇలా పని యంత్రాలుగా మారిపోయి విపరీతమైన ఒత్తిడిని నిరంతరాయంగా అనుభవించేవారికి శరీరంలోని వివిధ భాగాలు, ముఖ్యంగా మెదడు, పుర్రె తీవ్రంగా వాయడం, ఉబ్బెత్తుగా కనిపించడం లాంటి లక్షణాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. అలాగే హార్ట్ స్ట్రోక్ నుంచి కూడా వీళ్లు తప్పించుకోవడం కష్టమంటున్నారు.

నిరంతరాయంగా ఒత్తిడిని ఎదుర్కునేవాళ్లలో గుండెకు రక్తం సరఫరా సవ్యంగా ఉండదట. రక్తనాళాలు కుంచించుకుపోయి, బిర్రబిగుసుకుని గుండెకు రక్తం సరఫరా పూర్తిగా తగ్గిపోతుందట. ఈ కారణాలవల్ల హార్ట్ బీట్ వేగం పెరిగి కొంత కాలానికి అలాగే స్థిరపడిపోతుందట. ఉండాల్సిన దానికంటే ఎక్కువ హార్ట్ బీట్ ఉన్నప్పుడు ఎప్పుడూ ఆ మనిషికి ముప్పు పొంచే ఉంటుందట.

సాధారణంగా ఆరోగ్యవంతమైన మానవులకు హార్ట్ బీట్ 60 నుంచి 100 సార్లకు మధ్యలో ఉంటుంది. అదికూడా ఒక్క నిమిషం రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే. అంతకు మించి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెడితే ఆరోగ్యపరమైన సమస్యల్ని ఎదుర్కోవడానికి ఎంతో కాలం ఎదురుచూడాల్సిన అవసరం లేదనే లెక్క. అదికూడా గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతాయని లెక్క.

ఇలాంటివాళ్లలో ఉన్నపళంగా బీపీ పెరిగిపోవడం, విపరీతమైన కోపం, విపరీతమైన స్థాయిలో భావోద్వేగాలు, భావాలపై పూర్తిగా పట్టు కోల్పోవడం, డిప్రెషన్ లాంటి అనేక రకాలైన సమస్యల్ని త్వరలోనే ఎదురవ్వబోయే ముప్పుకు సూచికలుగా భావించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 11 వేలమందికి పైగా ఇలాంటి వ్యక్తుల్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత ఈ ఫలితాలను వెల్లడించారు.

అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారిలో ప్రతి వందమందిలో కనీసం ఏడుగురు ఈ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నట్టుగా మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ స్పష్టం చేస్తున్నాయి. వీలైనంత త్వరగా మామూలు మనుషుల్లో పడడం, పని గంటలను, పని చేసే స్థలంలో ఒత్తిడిని నియంత్రించుకోవడం, వారానికి కచ్చితంగా కొన్ని గంటలు కుటుంబంతో గడపడానికి, వినోదానికి కేటాయించుకోవడం లాంటి పనులను యుద్ధప్రాతిపదికన చేపడితే ఆత్యయిక పరిస్థితిని వీలైనంత దూరంగా నెట్టడానికి ఆస్కారం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Next Story