గ్రహాంతర ఇళ్లకు ఫంగస్ హంగు
By అంజి Published on 22 Jan 2020 1:26 PM ISTచంద్రుడిపైన, అంగారకుడిపైన ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్నారా? హాయిగా కట్టేసుకోవచ్చు. కానీ ఏదో ఇటుకలు, సిమెంటు, పైన కొన్ని రేకులతో మనం కట్టుకున్నట్టుగా ఇల్లు కట్టేసుకోవచ్చు అనుకుంటున్నారా? కాదండీ బాబూ కాదు. చంద్రుడిపై, అంగారకుడి పై ఇల్లు కట్టుకోవాలంటే అక్కడి వాతావరణం అంత అనుకూలం కాదు. అందుకే అక్కడ ఇల్లు కట్టుకుని నివసించాలంటే వ్యోమగాముల కోసం ఫంగస్ అంటే శిలీంధ్రాల సాయంతో ఇల్లు కట్టుకోవాలి. ఫంగస్ తో గోడలు, కప్పు వేసుకోవాలి. ఫంగస్ నుంచి తయారైన వస్తువులతో ఇల్లు కట్టుకోకపోతే కొంప కొల్లేరవుతుందని నాసా హెచ్చరిస్తోంది. ఫంగస్ లో చిన్న చిన్న వైర్ల లాంటి మైసీలియా అనే భాగం ఉంటుంది. వీటి సాయంతోనే గ్రహాంతర గృహాలు కట్టుకోవచ్చునని నాసా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ తరహా గృహనిర్మాణాన్ని మైకో ఆర్కిటెక్చర్ అంటారట. కాలిఫోర్నియాలోని నాసా ఏమ్స్ రీసెర్చి సెంటర్ లో వీటిపై పరిశోధనలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం తాబేలు తన కవచాన్ని తానే మోసుకెళ్లినట్టు అంగారక గ్రహంలో వ్యోమగాములు తమ ఇళ్లను తామే వెంట మోసుకెళ్లాలి. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఈ ఫంగస్ ఇళ్లను తక్కువ ఖర్చుతో కట్టుకోవచ్చునని నాసా చెబుతోంది. దీని బరువు చాలా తక్కువ. ఫంగస్ స్పోర్ (బీజాల వంటివి) చాలా ఏళ్ల పాటు నిద్రావస్థలో ఉండగలవు. అంగారకుడిపైకి వెళ్లాక కొద్దిగా నీరు తగిలిస్తే చాలు స్పోర్సు మేల్కొంటాయి. అక్కడి వాతావరణానికి సరిపడే విధంగా ఇళ్ల రూపంలో వీటిని మార్చుకోవచ్చునని నాసా చెబుతోంది. అయితే ఈ స్పోర్సు అంగారక గ్రహం వాతావరణాన్ని చెడగొట్టకుండా, సమూహంనుంచి వేరైన మరుక్షణం అవి పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోయేలా చేస్తున్నారు నాసా శాస్త్రవేత్తలు.
సో... రేపు అంగాకర గృహాలకు, చంద్ర గృహాలకు ఫంగస్ కావాల్సి వస్తుంది కాబట్టి, ఇక్కడ ఫంగస్ పంటలు వేసి వ్యాపారం మొదలుపెట్టేద్దామా?