Fact Check : ముస్లింలు ప్రార్థనలు చేస్తూ ఉండగా.. నిరసన కార్యక్రమాలు చేపట్టారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2020 6:28 AM GMT
Fact Check : ముస్లింలు ప్రార్థనలు చేస్తూ ఉండగా.. నిరసన కార్యక్రమాలు చేపట్టారా..?

18 సంవత్సరాల ముస్లిం రెఫ్యూజీ విద్యార్థి అయిన అబ్దవుల్లాక్ అంజోరోవ్ ఫ్రెంచ్ టీచర్ శామ్యూల్ ప్యాటీని ప్యారిస్ లో అక్టోబర్ 16న కిరాతకంగా హత్య చేసి చంపాడు. భావ ప్రకటనా స్వేఛ్చ కింద నిర్వహించిన క్లాస్ లో భాగంగా మొహమ్మద్ ప్రవక్త మీద ఛార్లీ హెబ్దో గీసిన కార్టూన్లను ఆ లెక్చరర్ చూపించారు. దీంతో ఆగ్రహం చెందిన అబ్దవుల్లాక్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనతో ఫ్రాన్స్ దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో పలు తప్పు ద్రోవ పట్టించే పోస్టులు కూడా సామాజిక మాధ్యమాల్లో వెలుస్తూ ఉన్నాయి.



ట్విట్టర్ యూజర్ Tarek Fatah కూడా ఓ వీడియోను పోస్టు చేశారు. ముస్లింలు ప్యారిస్ రోడ్ల మీద ప్రార్థనలు చేస్తూ ఉండగా, ఫ్రెంచ్ పౌరులు నిరసన వ్యక్తం చేయడాన్ని గమనించవచ్చు. ఫ్రెంచ్ పౌరులు గట్టిగా ఆ దేశ జాతీయ గీతాన్ని పాడడాన్ని వీడియోలో గమనించవచ్చు. ఈ పోస్టును పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం జరిగింది. “In Paris, as Muslims pray on roads, blocking streets, they are met with equally loud singing of the French National Anthem by French citizens.” అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.

ఈ వీడియో ఇటీవల చోటు చేసుకుందేమోనని పలువురు భావిస్తూ ఉన్నారు.

F1

ఇదే వీడియోను ఇటీవల ఫేస్ బుక్ లో కూడా పలువురు షేర్ చేశారు.

నిజ నిర్ధారణ:

ఈ వీడియో ఫ్రాన్స్ కు చెందినదే.. కానీ ఇటీవలి కాలంలో చోటు చేసుకున్నది కాదు. 2017 సంవత్సరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 2017లో చోటు చేసుకున్న ఘటన అని తేలింది. “Clichy: Demonstration against street prayers!.” అంటూ వీడియోను పోస్టు చేశారు.

వీడియో టైటిల్ ఆధారంగా గూగుల్ లో సెర్చ్ చేస్తే నవంబర్ 10, 2017న ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా పలు మీడియా సంస్థలు కథనాలను వెల్లడించాయి. ప్యారిస్ క్లిచిలోని మసీదును అధికారులు మూసివేశారు. దీంతో 200 మంది ముస్లింలు నడిరోడ్డులో ప్రార్థనలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఫ్రెంచ్ మేయర్ తో పాటూ కొన్ని డజన్ల మంది ఎంపీలు కూడా అక్కడకు వచ్చి ప్రార్థనలు చేయకుండా అడ్డుకున్నారు. వారు ప్రార్థనలు చేస్తూ ఉండగా.. మిగిలిన వారందరూ ఫ్రాన్స్ జాతీయగీతాన్ని పాడారు. ఈ ఘటనకు సంబంధించిన ఎన్నో వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

5000 మంది ముస్లింలు ప్రార్థనలు చేసుకునే వెసులుబాటు ఉన్న మసీదును అక్కడి మేయర్ మూసివేయడంతో ముస్లింలు అప్పట్లో అలా రోడ్డు మీద ప్రార్థనలు చేసి నిరసన వ్యక్తం చేశారు.

F2

అప్పటి వీడియోకు, వైరల్ అవుతున్న వీడియోకు మధ్య పెద్దగా తేడాలు కనిపించవు. రెండింటిలోనూ ఉన్న సారూప్యతలను గమనించవచ్చు.

F4

వీడియోను వివిధ యాంగిల్స్ లో తీశారు కొందరు. అందులో అక్కడ గోధుమ రంగులో ఉన్న గోడ, చెట్టును కూడా గమనించవచ్చు.

“Stop illegal street prayers” అనే నినాదం ఉన్న బ్యానర్ ను కూడా గమనించవచ్చు.

BBC, Straits Times ఇతర మీడియా సంస్థలు కూడా ఈ నిరసనపై కథనాలను వెల్లడించాయి.

ఈ వైరల్ అవుతున్న వీడియో ఇప్పటిది కాదు.. 2017 లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో చోటు చేసుకుంటున్న నిరసనలకు, దీనికి ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న పోస్టులు 'ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తూ ఉన్నాయి'.

Claim Review:Fact Check : ముస్లింలు ప్రార్థనలు చేస్తూ ఉండగా.. నిరసన కార్యక్రమాలు చేపట్టారా..?
Claim Reviewed By:Vamshi Krishna
Claim Fact Check:false
Next Story