విదేశీ వస్తువులను బహిష్కరిస్తే ఏం జరుగుతుంది?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Jun 2020 8:05 PM ISTవిదేశీ వస్తువుల బహిష్కరణపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల ఆర్థిక రంగం తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో స్వదేశీ వస్తువుల వాడకాన్నే ప్రోత్సహించాలని గతంలొో ప్రధాని మోడీ కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని 130 కోట్ల మంది జనాభానే మన దేశం బలమని, దేశ ప్రజలంతా విదేశీ వస్తువులను బహిష్కరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఎగబాకుతుందని షా వ్యాఖ్యానించారు. స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా షా చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. విదేశీ వస్తువుల బహిష్కరణ ఎలా సాధ్యపడుతుందో ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు.
స్వావలంబన భారత్...కొద్ది రోజుల క్రితం ప్రధాని మోడీ నోటి నుంచి ఈ మాట వినగానే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అయితే, మన దేశం తన కాళ్ల మీద తాను నిలబడి ఆర్ధికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వ రంగం బలోపేతం కావాలి. కానీ, 1992 నుండి మొదలైన యల్.పి.జి విధానాల(సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ) వల్ల స్వావలంబన కాగితాలకు, ప్రసంగాలకే పరిమితమైంది. మనదేశపు అత్యుత్తమ ప్రధానుల్లో ఒకరైన వాజ్‌పేయి కూడా యల్.పి.జి విధానాలకే కట్టుబడ్డారు. "భారత్ లో తయారీ" పేరుతో సంపన్న వర్గాలు మరింత సంపన్నం కావడం తప్ప ఒరిగేదేమీ లేదన్నది ఆర్థిక నిపుణుల వాదన.
భారత్ లోని అనేక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు నాటి...నేటి ప్రభుత్వాలు ఎర్ర తివాచీ పరిచి మరీ స్వాగతం పలికాయి. అటువంటి సందర్భంలో విదేశీ వస్తువులు బహిష్కరించడం ఎలా సాధ్యపడుతుంది? మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమల్లో 88 శాతం విడిభాగాలు విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. 70 శాతం బల్క్ డ్రగ్స్ చైనా నుంచి, 60 శాతం వైద్య పరికరాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విదేశీ వస్తువులను నిషేధించడం ఎలా సాధ్యమేనా? ఇటువంటి నేపథ్యంలో విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వావలంబన భారత్ వంటివి చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ, ప్రాక్టికల్ గా అమలు చేయడానికి సాధ్యపడవన్నది నిపుణుల వాదన.
గతంలోనూ చైనాతో విభేదాలు వచ్చినపుడు... మన దేశంలో చాలామంది స్వదేశీ మంత్రం జపించారు. చైనాకు చెందిన వివో, ఒప్పో వంటి పలు ఫోన్ల షోరూమ్ లపై దాడి జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ వ్యవహారం జనం మరచిపోయారు. షరా మామూలుగా కారు చౌకగా దొరికే చైనా ఫోన్లను వాడుతున్నారు. ఇపుడు జనం వాడుతున్న ఫోన్లు, ఫోన్ల విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ సంబంధిత వస్తువుల్లో మెజారిటీ విదేశాలవే. స్వదేశీ వస్తువుల వాడకం అనేది మంచి కాన్సెప్టే. కానీ, ఇపుడు మన దేశం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా? మన దగ్గర అందుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించే వెసులుబాటు ఉందా? అయితే, క్రమక్రమంగా విదేశీ వస్తువుల వాడకం తగ్గించుకుంటూ.. వాటిని స్వదేశంలో తయారు చేసుకోవడం....వంటివి చేసిన తర్వాత విదేశీ వస్తువుల బహిష్కరణ గురించి మాట్లాడడం ఉత్తమం అన్నది ఆర్థిక నిపుణుల వాదన.