ఓరి.. వీడి తెలివితేటలో.. వేరుశెనగ కాయల్లో అంత డబ్బు ఉందా..?

By అంజి  Published on  13 Feb 2020 11:08 AM GMT
ఓరి.. వీడి తెలివితేటలో.. వేరుశెనగ కాయల్లో అంత డబ్బు ఉందా..?

వేరుశెనగ కాయలు వలిచినప్పుడు మీకు ఎప్పుడైనా డబ్బులు కనపడ్డాయా..? అయినా వేరుశెనగ కాయల్లోకి డబ్బులు ఎలా వస్తాయి అని మీకు డౌట్ రావచ్చు.. కనీసం అలాంటి ఆలోచన కూడా మనకు ఉండదు.. కానీ ఓ ప్రయాణీకుడి బ్యాగేజ్ లో ఉన్న వేరుశెనగ కాయలను కాస్త క్షుణ్ణంగా పరిశీలించగా వాటిలో నుండి నోట్లు బయటకు వచ్చాయి. అతడి బ్యాగులో ఉన్న ఆహారపదార్థాలు మొత్తం వెతకగా 45లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ బయటపడింది. వేరుశెనగ కాయలనే కాకుండా హల్వా, బిస్కట్ ప్యాకెట్లు, వండిన మటన్ పీసులను కూడా డబ్బులను దాచడానికి వాడాడు.

ఢిల్లీ లోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మంగళవారం నాడు మురాద్ ఆలమ్ అనే వ్యక్తి బ్యాగేజీని సిఐఎస్ఎఫ్ సిబ్బంది చెకింగ్ చేయగా మొత్తం బండారం బయటపడింది. విదేశీ క‌రెన్సీని అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఆల‌మ్‌ను క‌స్ట‌మ్స్ అధికారుల‌కు అప్ప‌గించారు. యూరో, సౌదీ, ఖతర్‌, కువైట్‌, ఒమన్‌ దేశాల కరెన్సీ ఆ వ‌స్తువుల్లో ఉండడంతో అధికారులు షాక్ తిన్నారు. మురాద్ ఎయిర్ పోర్టు లోకి వచ్చినప్పటి నుండీ అతడి చర్యలు అనుమానాస్పదంగా అనిపించాయి. దీంతో సెక్యూరిటీ చెక్ ఏరియాలో ఉన్న అధికారులను ఇంటెలిజెన్స్ అధికారులు అలర్ట్ చేశారు. దీంతో మురాద్ ను అదుపులోకి తీసుకున్నారు.

మురాద్ చేతిలో ఉన్న బ్యాగును పోలీసులు పరిశీలించారు. అందులో అన్నీ తిను బండారాలే..! ఫిజికల్ చెక్ కోసం పోలీసులు ఆ బ్యాగును తీసుకున్నారు. ఒక బ్యాగులో మొత్తం వేరుశెనగ కాయలు ఉన్నాయని.. వాటిని బంక లాంటి పదార్థంతో అతికించినట్లు తెలిసిందని హేమేంద్ర సింగ్ అనే సిఐఎస్ఎఫ్ పోలీసు తెలిపారు. ఆ తర్వాత దాన్ని ఎక్స్-రే స్క్రీనింగ్ చేయగా.. వాటిలో ఏమో ఉన్నాయని తమకు అనుమానం వచ్చిందని అన్నారు. కొన్ని వేరు శెనగ కాయలను వలచగా అందులో నుండి దిర్హామ్, రియాల్, యూరోలు బయటపడ్డాయి. ఒక్కో నోటును చిన్నగా మడిచి.. వాటికి చిన్న చిన్న దారాలతో కట్టేసి లోన ఉంచారు. ఇక అతడి దగ్గర ఉన్న బిస్కెట్ ప్యాక్ లు పూర్తిగా సీల్ చేసినట్లు అనిపించాయి. అలా ఆ బిస్కెట్ ప్యాక్ ను ఓపెన్ చేయగా.. మధ్యలో పెద్ద రంధ్రం చేసి అందులో నోట్ల కట్టలను ఉంచారు. ఇక అప్పుడే వండిన మటన్ పీసుల్లో కూడా ఓ ప్లాస్టిక్ కవర్ ను ఉంచి అందులో కరెన్సీని పెట్టారు.

మురాద్ టూరిస్టు వీసాతో దుబాయ్ కి వెళుతుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షహరాన్ పూర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గతంలో పలు మార్లు మురాద్ దుబాయ్ కె కాకుండా ఇతర దేశాలకు వెళ్ళాడు. ఈ స్మగ్లింగ్ వెనుక బడా వ్యక్తులే ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Next Story