'విదేశీ అతిథుల'కు.. ఉరితాళ్లుగా మారుతున్న చేపల వలలు

By అంజి  Published on  2 March 2020 7:46 AM GMT
విదేశీ అతిథులకు.. ఉరితాళ్లుగా మారుతున్న చేపల వలలు

హైదరాబాద్‌: వేసవి విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చే విదేశీ పక్షులు వలలకు చిక్కి అల్లాడుతున్నాయి.. చేపల వలలే వాటికి ఉరితాళ్లుగా మారుతున్నాయి. చేపల వలలకు చిక్కి ఎన్నో పక్షులు మృతి చెందుతున్నాయి. ఎంతో ఆనందంతో గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను కన్నాక వాటితో తిరిగి సొంత దేశానికి వెళ్దామనుకునే పక్షులు.. వలల సుడిగుండంలో పడి ప్రాణాలను వదులుతున్నాయి. తమ ఆహారం కోసం వేటాడుతుండగా వలకు చిక్కుకొని.. దాని నుంచి విడిపించుకునే క్రమంలో పక్షులు మరణిస్తున్నాయి.

నగరంలోని దేశ, విదేశాల నుంచి అనేక పక్షులు సంతానోత్పత్తి కోసం నగరంలోని సహజ సిద్ధమైన పక్షుల విడిది కేంద్రమైన గండిపేట చెరువు వద్దకు వస్తాయి. ఆ తర్వాతత గుడ్లు పెట్టి పొదిగి, తిరిగి అవి ఎగిరే శక్తి సంపాదించకున్నాక తమ దేశాలకు వెళ్తుంటాయి. ఈ క్రమంలో పక్షులు చేపల వలలకు చిక్కి ప్రాణాలను పొగొట్టుకుంటున్న విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. గత కొన్ని రోజులుగా గండిపేట చెరువు వద్ద ఈ విషయాన్ని పరిశీలించింది. చేపలు పట్టేవారిలో అవగహనలేమితోనే ఇది జరుగుతోందని ఆ సంస్థ చెప్పింది. వలస పక్షులకు మృత్యువుగా మారుతున్న అక్కడి పరిస్థితులను ఫారెస్ట్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అలాగే పక్షులను రక్షించేందుకు.. జాలరులకు అవగాహన కార్యక్రమంల నిర్వహించేందుకు ఆ స్వచ్ఛంద సంస్థ సిద్ధమైంది.

వేసవి సమయంలో విదేశాల నుంచి చాలా పక్షులు వలస వస్తుంటాయి. నీటి వనరులు కలిగి ఉన్న ప్రాంతాలను తమ ఆవాసాలుగా ఏర్పరచుకుంటాయి. తెలంగాణలో చాలా ప్రాంతాలు విదేశీ పక్షులకు విడిది కేంద్రాలుగా ఉన్నాయి. అందులో గండిపేట చెరువు ఒకటి. ఇప్పుడు గండిపేట చెరువు వద్ద విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో కొన్ని పక్షులు వలలో పడి మరణిస్తున్నాయి. యానిమల్‌ వారియర్స్‌ సంస్థ సభ్యులతో ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది.

గండిపేట చెరువులో చాలా మంది జాలరులు చేపలను వేటాడుతుంటారు. ప్రతి సంవత్సరం వర్ష కాల సమయంలో చెరువులో చేప పిల్లలను వేసి.. తిరిగి అవి పెద్దాయ్యాక వాటిని పట్టి అమ్ముకొని జాలరులు తమ జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే వీరు చేపలు పట్టేందుకు ప్రధానంగా వలలను, ముళ్ల పొదలను వాడుతున్నారు. వాటికి చిక్కే చేపలను తీసి అమ్ముతున్నారు. ఈ క్రమంలో కొన్ని వలలు ముళ్లపొదలకే చిక్కుకుపోతున్నాయి. ఇక వాటిని తీయడం సాధ్యం కాదని.. జాలర్లు సైతం వాటిని అక్కడే వదిలేస్తున్నారు. ఇదే సమయంలో పక్షులు ఆ ముళ్ల పొదలపై ఆహారం కోసం వాలుతున్నాయి.

వలలను, వ్యర్థాలను తొలగించిన పక్షి ప్రేమికులు

చేపలను పక్షులు తమ ముక్కుతో వేటాడుతుంటాయి. ఇలా వేటాడే సమయంలో పక్షి ముక్కు.. వలలో చిక్కుకుపోతోంది. చిక్కుకున్న వలను విడిపించుకునే క్రమంలో అది ముక్కుకు ఇంకా గట్టిగా బిగుసుకుపోతోంది. ఇలా ముక్కు తెరుచుకొలేని స్థితిలో ఆహారం తీసుకోలేక పక్షులు మరణిస్తున్నాయి. ఈ విషయాన్ని యానిమల్‌ వారియర్స్‌ సంస్థ తెలిపింది. ఇక్కడ ప్రధానంగా పాత వలలు.. పక్షులకు శాపంగా మారాయి. ఆదివారం రోజున హైదరాబాద్‌ బర్డింగ్‌ పాల్స్‌ అన మరో సంస్థతో కొందరు పక్షి ప్రేమికులు.. గండిపేట చెరువులోని తుప్పలకు పట్టుకొని వలలను తొలగించారు. గండిపేట చెరువు చిలుకూరువైపు ప్రధానంగా వలల భాగాలను పెద్ద మొత్తంలో వెలికితీశారు. అలాగే వ్యర్థాలను కూడా బయటకు తీశారు.

దీనిపై జాలరులకు మరింత అవగాహన కల్పించాల్సి ఉందని యానిమల్‌ వారియర్స్‌ సభ్యులు ప్రదీప్‌ నాయర్‌, సంజీవ్‌ రావు పేర్కొన్నారు. నీటిలో వదిలేసిన పాత వలల తొలగించి, భవిష్యత్తులో మళ్లీ రాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. చేపలు పట్టేందుకు అంతర్జాతీయ పద్ధతులేంటో గుర్తిస్తున్నామని తెలిపారు. అటవీశాఖ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు.

Next Story