ఫ్లైట్ సర్వీసింగ్ సెంటర్‌ హైదరాబాద్‌లోనే ఎందుకు ఏర్పాటు చేశారు?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2019 12:46 PM GMT
ఫ్లైట్ సర్వీసింగ్ సెంటర్‌ హైదరాబాద్‌లోనే ఎందుకు ఏర్పాటు చేశారు?

బైకులు, కార్ల సర్వీసింగ్‌ గురించి మనకు తెలుసు. మరి విమానాల సర్వీసింగ్ సంగతేంటీ..? ఫ్లైట్స్‌, ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ సర్వీసింగ్‌ ఎలా చేస్తారు..? ఎక్కడ చేస్తారు.? ఫ్లైట్ సర్వీసింగ్ ప్రత్యేకతలేంటి..!

రవాణా రంగంలో విమానయాన రంగానిది స్పెషల్‌ స్టోరీ. బస్సులు, కార్లలో ఉన్నట్లుగానే విమానాల్లోనూ చాలా రకాలున్నాయి. ఫ్లైట్స్‌, బోయింగ్స్‌, కార్గో, ఎయిర్‌ క్రాఫ్ట్స్‌, హెలికాప్టర్స్‌.. ఇలా ఎన్నో రకాలు. ఎయిర్‌పోర్ట్స్‌, ఫ్లైట్‌ జర్నీ, ఛార్జీలే కాదు.. ఫ్లైట్‌ మెయింటెనెన్స్‌ కూడా చాలా స్పెషల్‌. చిన్న పొరపాటు జరిగినా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.

బైక్‌, కార్‌ను ఎలా చెక్‌ చేసుకుని సర్వీసింగ్‌ చేయిస్తామో విమానాలకు అంతే. వాటికి ఓ పాయింట్‌ ఉంటుంది. అదే ఎమ్‌ఆర్‌ఓ కాంప్లెక్స్‌. అంటే మెయింటెనెన్స్‌, రిపేర్‌-ఓవర్‌హాల్ట్‌ సెంటర్‌. ఎయిర్‌ ఇండియా ఎమ్‌ఆర్‌ఓ కాంప్లెక్స్‌ శంషాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఉంది. సర్వీసింగ్‌ చేసే స్థలాన్ని హ్యాంగర్‌గా పిలుస్తారు. ఒక్క హ్యాంగర్‌లో ఒకేసారి రెండు విమానాలకు సర్వీసింగ్‌ చేసే ఫెసిలిటీ ఉంది.

ప్రయాణానికి ముందు, తర్వాత.. ఎయిర్‌క్రాఫ్ట్‌ను లైన్‌ మెయింటెనెన్స్‌ సిబ్బంది చెక్‌ చేస్తారు. టైర్లు, ఇంజిన్‌, కాక్‌పిట్‌, కంటైనర్స్‌, సీట్స్‌, డోర్స్‌ ప్రతీది క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. లైన్‌ మెయింటెనెన్స్‌లో ఏదైనా లోపం కనిపిస్తే ఎయిర్‌క్రాఫ్ట్‌ను వెంటనే ఎమ్‌ఆర్‌ఓకు తరలిస్తారు. ఫ్లైట్‌లో కాక్‌పిట్‌ కీలకం. ప్రమాదాలు జరిగే సమయంలో చివరి రెండు గంటల ఆడియో కాక్‌పిట్‌లో రికార్డ్‌ అవుతుంది. అందుకే కాక్‌పిట్‌ను జాగ్రత్తగా తనిఖీ చేస్తారు.

2015 మే 29న శంషాబాద్‌లో ఎమ్‌ఆర్ఓ కాంప్లెక్స్‌ ఏర్పాటైంది. అదే ఏడాది జులై నుంచి సర్వీసింగ్‌ మొదలైంది. డాకింగ్‌ సిస్టమ్‌, ఈఓటీ క్రేన్స్‌, ప్లగ్‌ అండ్‌ ప్లే ఐటీ నెట్‌వర్క్‌, ఎస్‌ఏపీ, అసోసియేటెడ్‌ బ్యాక్ షాప్‌, ఏసీ మెయింటెనెన్స్‌ వంటి ఫెసిలిటీస్‌ ఉన్నాయి. సర్వీసింగ్‌ అనంతరం ఆయిల్స్‌, వేస్టేజ్‌ మెటీరియల్‌ని రీసైక్లింగ్‌ చేస్తారు.

శంషాబాద్‌లోనే ఎమ్‌ఆర్ఓ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయడానికి చాలా కారణాలున్నాయి. హైదరాబాద్‌ వాతావరణం, ఫ్లైట్‌ కనెక్టివిటీ, టర్నరోవర్‌ టైం తక్కువగా ఉండటం, అసోసియేటెడ్‌ షాప్స్‌, కేపబిలిటీ లిస్ట్‌ ఎక్కువగా ఉండటం, ఒకేసారి రెండు ఎయిర్‌బస్‌లను సర్వీసింగ్‌ చేసే ఫెసిలిటీ ఉండటం, తక్కువ పెట్టుబడి తదితర అంశాలు కలిసొచ్చాయి. ఐతే, ప్రస్తుతం ఎమ్‌ఆర్ఓ కాంప్లెక్స్‌ సంక్షోభంలో పడిపోయింది. ఆర్థిక సమస్యలు సంస్థను ఇబ్బంది పెడుతున్నాయి. ఐతే, సమస్యలు తాత్కాలికమే అని, భవిష్యత్తులో మళ్లీ ప్రగతి పథంలోకి దూసుకెళ్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడిని పెంచి శంషా బాద్‌ ఎమ్‌ఆర్‌ఓను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తంచేశారు.

Next Story