హత్యకు గురైన చేపల వ్యాపారి

By రాణి  Published on  5 Feb 2020 10:04 AM GMT
హత్యకు గురైన చేపల వ్యాపారి

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చేపల వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. జూబ్లీహిల్స్ లోని జవహర్ నగర్ లో గల ఒక ఇంట్లో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి చూడగా..రమేశ్ అనే చేపలవ్యాపారి హత్యకు గురైనట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిబ్రవరి 1వ తేదీన రమేశ్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు. తర్వాత ఆయన ఆచూకీ ఎంతకీ దొరకక పోవడంతో కుటుంబ సభ్యులు ఎస్ ఆర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

బోరబండ రామారావు నగర్ లో నివాసముండే రమేశ్ ను గుర్తుతెలియని వ్యక్తులు ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలో బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు రమేశ్ ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలో రమేశ్ మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం ఒక ఇంట్లో గుర్తించడంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే 1వ తేదీన రమేశ్ ను కిడ్నాప్ చేసిన వ్యక్తులు రూ.కోటి డిమాండ్ చేశారని రమేష్ ఫోన్ సంభాషణల ఆధారంగా తెలుసుకున్నారు. కోటి రూపాయలు ఇ్వనందునే కిడ్నాప్ చేసిన మరుసటి రోజే రమేశ్ ను హతమార్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా..రమేశ్ మొబైల్ కు వచ్చిన ఫోన్ నంబర్లు ఎవరివి ? ఎక్కడి నుంచి వచ్చాయి ? తదితర కోణాల్లో విచారణ జరుగుతోంది. అలాగే కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించగా.. ఇటీవలే రమేష్ తనకున్న ఆస్తులను అమ్మి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. చేపల వ్యాపారం చేసి బాగా ఆస్తులు సంపాదించాడని గ్రహించిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

Next Story