భర్త తాళి తీసుకెళ్లడంతో..నవ వధువు ఆత్మహత్య

By రాణి  Published on  5 Feb 2020 8:43 AM GMT
భర్త తాళి తీసుకెళ్లడంతో..నవ వధువు ఆత్మహత్య

నూరేళ్లు తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి తాళి కట్టిన భర్తే..తన మెడలోని తాళిని బలవంతంగా తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని కోదండరామ వీధిలో నివాసముంటున్న బుడుమూరు ఝాన్సీ (19) తన చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుని, పెద్దల్ని ఎదురించి, చివరికి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఝాన్సీ, సాయితేజ. పెళ్లయ్యాక భర్త పనీపాట లేకుండా తిరగడం, కుటుంబం పట్ల గానీ..తన పట్ల గానీ కనీస బాధ్యత లేకుండా ఉంటున్న అతని ప్రవర్తన ఝాన్సీని ఎంతో బాధించింది.

పెళ్లైన నాటి నుంచి సాయితేజ తన భార్యతో కలిసి తల్లిదండ్రులపైనే ఆధారపడ్డాడు. సాయితేజ వారికి ఒక్కగానొక్క కుమారుడు. తండ్రి రామకృష్ణ ఆటో డ్రైవర్. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులంతా కలిసి సినిమాకి వెళ్లొచ్చారు. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో సాయితేజ కుటుంబ సభ్యులతో కలిసి రాకుండా ఆలస్యంగా ఇంటికి చేరుకోవడంతో తండ్రి మందలించినట్లుగా సమాచారం. తండ్రి మందలించిన విషయాన్ని మనసులో పెట్టుకుని సాయితేజ బుధవారం భార్య ఝాన్సీ మెడలో ఉన్న తాళిని బలవంతంగా లాక్కొని వెళ్లినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. భర్తే మెడలో ఉన్న తాళిని తీసేయడంతో మనస్తాపం చెందిన ఝాన్సీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఝాన్సీ అత్త సరోజిని, మామ రామకృష్ణలను విచారణ చేశారు. ఝాన్సీ తండ్రి వీఆర్వోగా పనిచేస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రుల స్వగ్రామం హిరమండలం పెద్దకిట్టాలపాడు. కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Next Story
Share it