ఐపీఎల్ బృందంలోకి తొలిసారిగా ఓ మహిళ..!
By సత్య ప్రియ Published on 25 Oct 2019 6:28 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పీఎల్) లో ఒక కొత్త శకం మొదలయ్యింది. విరాట్ కోహ్లీ నేతృత్వం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టులో ఒక మహిళ… సహాయక సిబ్బందిలో చేరారు. స్పోర్ట్స్ మస్సాజ్ థెరపిస్ట్ గా నవనీతా గౌతం చేరినట్లు ఆర్సీబి యాజమాన్యం ప్రకటించింది.
ఆర్సీబీ ప్రధాన ఫిజియోగా ఇవాన్ స్పీచ్లీ వ్యవహరిస్తుండగా, నవనీతా ఆయనకు సహాయకురాలిగా జట్టులో పని చేస్తారు. ఆటగాళ్ల ఫిట్నెస్ కోసం ప్రత్యేక నైపుణ్య సాధనాలు చేయించడం, మోటివేషన్ కలిగించడం తో పాటు శారీరక గాయాలకు సంబంధించిన చికిత్స అందించడంపై ఆమె ప్రముఖంగా దృష్టి పెడతారు.
ఒక చారిత్రక ఘట్టంలో భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నాననీ, ఆటల్లో మహిళల ప్రాధాన్యాన్ని గుర్తించి సహాయక బృందాల్లో వారికి అవకాశం ఇవ్వడం ఎంతో అవసరం అని, నవనీతా వంటి నైపుణ్యం గల వ్యక్తి ని వెలికితీసినందుకు చాలా సంతోషంగా ఉందనీ ఆర్సీబి చైర్మన్ సంజీవ్ చురివాలా అన్నారు.
2020లో ఐపిఎల్ 13వ సీజన్ మొదలు కానుంది, ఆటగాళ్లను ఎంచుకునే ప్రక్రియ కూడా జరుగనుంది. ఇటువంటి తరుణంలో ఆర్ సీబి ముందుగానే తన సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే, ఇన్ని సీసన్లుగా ఆర్సీబి ఒక్కసారి కూడా కప్పును కొట్టలేకపోయింది.
సహాయక బృందంలో ఆర్సీబి ఎన్నో మార్పులు చేపట్టింది. గారీ క్రిస్టెన్, ఆశీష్ నెహ్రా లను తొలగించింది. క్రికెట్ ఆపరేషన్స్ కి డైరెక్టర్ గా మైక్ హెస్సన్ నూ, హెడ్ కోచ్ గా సైమన్ కటీచ్ నూ జట్టులో చేర్చుకుంది.
గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబి 11 పాయింట్లతో ఆఖరున నిలిచింది.