రేపు భారత్ చేరుకోనున్న 'రఫెల్'
By తోట వంశీ కుమార్ Published on 28 July 2020 4:32 AM GMTభారత్ ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలు రేపు భారత్‌కు చేరుకోనున్నాయి. మొదటి దశలో ఐదు విమానాలు ఫ్రాన్స్‌లోని మెరిగ్నాక్ వైమానికి స్థావరం నుంచి సోమవారం గాల్లోకి ఎగిరాయి. ఈ విమానాలు బుధవారం భారత్‌లోని అంబాలా ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు చేరుకుంటాయి. 2019లో పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై దాడిచేసిన భారత మిరాజ్ యుద్ధ విమానాలు టేకాఫ్ అయింది ఈ అంబాలా బేస్ నుంచే. ఫ్రాన్స్ నుంచి దాదాపు 7000 కిలోమీటర్ల ప్రయాణించనున్న ఈ విమానాలు మార్గమధ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో ఒక రాత్రి ఆగి.. ఆ తర్వాత ప్రయాణం కొనసాగిస్తాయి. సుశిక్షితులైన భారత పైలట్లే వాటిని నడుపుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన రెండు ట్యాంకర్ విమానాలు వీటికి గాలిలోనే ఇంధనాన్ని నింపనున్నాయి. అవసరమైతే భారత్‌కు చేరిన వారంలోగానే రాఫెల్ విమానాలను యుద్ధానికి సిద్ధం చేయగలమని వాయుసేన వర్గాలు చెబుతున్నాయి
శత్రుదేశంలోని వెళ్లాల్సిన అవసరం లేదు..
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడానికి మనం ఆ దేశ భూభాగంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేదు. పొరుగుదేశానికి ఏ మాత్రం అనుమానం రాకుండా మన గగనతలంలోనే ఉండి ముష్కర స్థావరాలపై పిడుగుల వర్షాన్ని మన వాయుసేన కురిపించగలదు. చైనా సరిహద్దులకు చేరువలో ఉన్న లేహ్ వంటి పర్వతమయం ప్రాంతం నుంచి కూడా ఈ జెట్ సునాయాసనంగా గాల్లోకి ఎగురుతుంది. ఎంబీడీఏ తయారీ స్కాల్ప్ క్షిపణి రాఫెల్ విమానం అమ్ములపొదిలోని మరో గొప్ప ఆయుధం. 560 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దీన్ని ప్రయోగించవచ్చు. అంటే సరిహద్దుకు ఎంతో ఇవతల నుంచే శత్రు శిబిరాలపై దీనితో దాడి చేయొచ్చు. పైగా తక్కువ ఎత్తులో ప్రయాణించే క్రూజ్ క్షిపణి కావడంతో దీన్ని శత్రు రాడార్లు కనిపెట్టగలిగే అవకాశాలు చాలా తక్కువ. లక్ష్యం తాలూకు చిత్రాన్ని దీనిలో ముందుగా ఫీడ్ చేయొచ్చు. ఇది లక్ష్యానికి చేరుకున్న తర్వాత ఫీడ్ చేసిన లక్ష్యం తాలూకు చిత్రంతో అక్కడి దృశ్యాన్ని పోల్చుకుని అప్పుడు దాడి చేస్తుంది. అందువల్ల లక్ష్యాన్ని గురితప్పకుండా ఛేదించడంతో పాటు అనవసరమైన నష్టాన్ని నివారించవచ్చు. రఫెల్ అంటే ఫ్రెంచ్ భాషలో గాలి దుమారం అని అర్థం. పేరుకు తగ్గట్లే అది భారత ప్రత్యర్థుల పాలిట గాలి దుమారం కానుంది.
మూడుదేశాల్లోనే..
ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే 3,700 కి.మీ దూరం వరకు ప్రయాణం చేయగల ఈ విమానాలు గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగలవు. పైలట్‌లకు రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించేందుకు హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, రాడార్ రిసీవర్లు, శత్రువుల సిగ్నల్ వ్యవస్థలకు అంతరాయం కలిగించే లో-బ్యాండ్ జామర్లు, ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్, ట్రాకింగ్ వంటి వ్యవస్థలు రాఫెల్‌లో ఉన్నాయి. కాగా ఈ యుద్ధ విమానాలను ఇప్పటివరకూ ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతర్ దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి.
రాఫెల్ విమానాలను దసాల్ట్ సంస్థ తయారుచేసింది. రూ.59,000 కోట్లతో 36 రాఫెల్ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో 2016లో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో 10 విమానాలను భారత్‌కు అప్పగించగా భారత పైలట్ల శిక్షణ కోసం ఐదు విమానాలు ఫ్రాన్స్‌లో ఉండిపోయాయి. 2021లోపు మొత్తం 36 విమానాలు భారత్‌కు చేరుకుంటాయి. వీటిలో 30 ఫైటర్ జెట్లు కాగా, 6 శిక్షణ విమానాలు.