సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం
By సుభాష్ Published on 24 Sept 2020 10:20 AM IST
సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్లాంట్‌లో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సూరత్‌లొఓని హజీరా ఆధారిత ఓఎన్‌జీసీ ప్లాంట్‌లోని టెర్మినల్స్ వద్ద వరుసగా మూడు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుడుతో భారీ శబ్దంరాగా, భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. కిలోమీటర్ల పొడవున పొగ కమ్ముకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారి ధావల్ పటేల్ తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. హైడ్రో కార్బన్ వాయువు లీకేజీతో అగ్నిప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్లాంట్‌లో ఒకటి కంటే ఎక్కువ పేలుళ్లు జరగడంతోనే భారీగా మంటలు ఎగిసిపడినట్లు నిపుణులు చెబుతున్నారు.
కాగా, ఇటీవల కాలంలో దేశంలోని పలు పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మే నెలలో వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనలో దాదాపు 15 మంది మృతి చెందగా, దాదాపు 200 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తర్వాత వైజాగ్‌లోని మరికొన్ని పరిశ్రమల్లోనూ ప్రమాదాలు సంభవించాయి. అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు జరిగి భారీగా మంటలు వ్యాపించాయి. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగానో.. ఇతర కారణాల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంది.