క్వారంటైన్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం
By తోట వంశీ కుమార్ Published on 21 April 2020 8:42 PM IST
కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. భారత దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఆర్థిక రాజధాని ముంబాయిలో నమోదవుతున్నాయి. ముంబాయిలో కరోనా రోగులకు క్వారంటైన్‌గా వినియోగిస్తున్న ఓ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం దక్షిణ ముంబైలోని నగ్పదా ప్రాంతంలోని రిప్పన్ హెటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లు, నాలుగు జంబో ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తెచ్చాయి. మూడు అంతస్తుల గల ఈ భవనంలో లాడ్జింగ్ రూం వరకే మంటలు పరిమితమయ్యాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. వెంటనే అక్కడ ఉన్న రోగులందరిని సురక్షిత ప్రాంతానికి తరలించామన్నారు. ప్రమాదం జరగడంతో కొందరు తలా ఓ చోట దాక్కుకున్నారని.. భవనంలో ఇంకా ఎవరైనా ఉన్నారా లేరా అనేది ఇప్పుడే చెప్పలేమని ప్రస్తుతం వారి కోసం భవనంలో గాలింపు చేపట్టామన్నారు.