వారానికి 4 రోజులు.. రోజుకి 6 గంటలే పని.. ఎక్కడంటే..
By Newsmeter.Network
ముఖ్యాంశాలు
- వారానికి మూడు రోజులు సెలవులతో ఫిన్లాండ్ ప్రధాని ప్రతిపాదన
- ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేయడం, ప్రొడక్టివిటీ పెరిగే అవకాశం
- అతిచిన్న వయసులోనే ప్రధానిగా ఎన్నికైన సనా మారిన్
సాధారణంగా ఉద్యోగులకు వారానికి ఒకరోజు సెలవు ఉంటుంది. అదే ఐటీ లో శని, ఆది వారాలు సెలవులు ఉంటాయి. అయితే మిగతా రోజుల్లో ఎనిమిది గంటల చొప్పున పని చేయాల్సి ఉంటుంది. మరి వారానికి మూడు రోజులు సెలవులు ఉంటే ఎలా ఉంటుంది? ఉద్యోగం చేసే నాలుగు రోజుల్లోనూ రోజుకు ఆరు గంటలే పని ఉంటే? ఫిన్లాండ్ ప్రధాని ఇటువంటి ప్రతిపాదనే చేశారు. ప్రపంచంలో అతి చిన్న వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఇటీవలే రికార్డ్ సృష్టించిన సనా మారిన్ ఇప్పుడు ఈ సరికొత్త నిర్ణయం తో వార్తలలో నిలిచారు. ఫిన్లాండ్ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో, తమకున్న హాబీలపై అధిక సమయాన్ని గడపాలంటూ ఆమె ఈ ప్రతిపాదన చేశారు.
అయితే, ఆమె ఈ నిర్ణయాన్ని రాత్రికి రాత్రే తీసుకోలేదు. ఆమె ఫిన్‌లాండ్ ప్రభుత్వంలో ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్‌గా పనిచేసిన రోజుల్లో తమ ఉద్యోగులపై ఈ ప్రయోగం చేశారు. దీని వల్ల ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా, ప్రొడక్టివిటీ కూడా పెరిగినట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
సనా మారిన్ కేవలం 34 ఏళ్ల వయస్సులోనే ఫిన్లాండ్ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రపంచంలోనే అతి పిన్న వయస్సులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. గతంలో ఉక్రెయిన్‌కు చెందిన ఒలెక్సీ హాన్చరుక్ 35 ఏళ్ల వయస్సులో ప్రధానిగా ఎన్నికయ్యారు. కానీ ఆయన రికార్డును సన్న మరిన్ చెరిపేశారు. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రధానిగా ఆంటీ రిన్నె బాధ్యతలు స్వీకరించారు. కానీ, దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయడంలో విఫలం కావడంతో సంక్షోభం తలెత్తింది. చట్ట సభలో విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో.. సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన సన్న మరినకు సభ్యులు మద్దతు పలికారు. సనా ను అధికారం పీఠం ఎక్కించారు.