అత్యాచారం కేసులో నిర్మాత దోషే.!
By అంజి Published on 26 Feb 2020 2:55 AM GMT
దశాబ్దాలపాటు హాలీవుడ్ ని ఏలిన ప్రముఖ నిర్మాతకు కోర్టు షాక్ ఇచ్చింది. అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణల ఆరోపణలు నిజమేనని రుజువు అవడంతో నిర్మాత హార్వే వీన్‌స్టెయిన్‌ను దోషిగా పేర్కొంటూ న్యూయార్క్ కోర్టు తీర్పు ఇచ్చింది. తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ దాదాపు 80 మంది మహిళలు 2017లో ఆయనపై ఆరోపణలు చేశారు. ఐరన్‌మ్యాన్ 3, ‘ఎవెంజర్స్ ఎండ్ గేమ్’ తదితర చిత్రాల్లో నటించిన గ్వైనెత్ పాల్ట్రో, కిల్ బిల్ ఫేమ్ ఉమా తుర్మన్, సల్మా హాయేక్ వంటి ప్రముఖ నటీమణులే ప్రజల ముందుకు వచ్చి తమ కష్టాలను చెప్పుకున్నారు.
వారిని చూసి చాలామంది హార్వే బాధితులు బయటకు వచ్చి అతనిపై లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో హాలీవుడ్‌లో ‘మీటూ’ ఉద్యమం మొదలైంది. హార్వేపై పలు కేసులు నమోదు అయ్యాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలను హార్వే ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చారు. కానీ 2018 మే నెలలో పోలీసులకు ఆయన లొంగిపోయాడు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిన న్యూయార్క్ కోర్టు హార్వేను దోషిగా ప్రకటించింది.