మహమ్మారి కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు అహర్నిశలు కష్టపడుతున్నాయి. అయినా కూడా ఈ వైరస్‌ చాప కింద నీరులా విస్తరిస్తూ.. తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేసింది. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని.. బయటకు రావొద్దని ముక్త కంఠంగా చెప్తూనే ఉన్నాయి. కరోనాపై అందరూ పోరుకు సిద్ధం కావాలని ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి వైరస్‌ తరిమి కొట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి.

ఇంత చెబుతున్నా.. దేశంలోని మహానగరాల్లోని ప్రజలు మాత్రం యేథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. 14 రోజుల పాటు బయటకు రావొద్దని సూచించిన రోడ్లపైకి వస్తున్నారు. బయటకు వస్తే మాత్రం కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామాల్లో మాత్రం కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైతన్యవంతంగా వ్యవహరిస్తున్నారు. ఇంద్రవెల్లి మండలం ఎమాయికుంట, అందుతండా గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు బతుకు దెరువు కోసం ఉగండాకు వెళ్లారు. అయితే వారు ఇటీవలే స్వదేశం చేరుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన జిల్లా వైద్యులు 14 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు.

Also Read: క‌రోనా ఎఫెక్ట్‌ : నిలిచిపోయిన దినపత్రికలు

ఎమాయికుంటకు చెందిన వ్యక్తి అతని కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. అతడు బయటకు రాకపోయిన.. కుటుంబ సభ్యులు మాత్రం బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామస్తులు వినూత్న మార్గం ఆలోచించారు. కొన్నాళ్లు పాటు ఆ కుటుంబానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ గ్రామంలో మొత్తం 120 కుటుంబాలు ఉండగా.. 20 కుటుంబాలు పోలాల్లో గుడారాలు వేసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఇలా చేస్తున్నారని ఆ గ్రామ సర్పంచ్‌ జాదవ్‌ లఖన్‌ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డకట్ట వేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎంపీటీసీ చెప్పారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.