తెలంగాణలో పండే పంటల్లో విచ్చలవిడిగా వాడేస్తున్నారట.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Jun 2020 8:21 AM GMT
తెలంగాణలో పండే పంటల్లో విచ్చలవిడిగా వాడేస్తున్నారట.!

షాకింగ్ అధ్యయనం ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎప్పుడు ఏ పంట వేయాలి? ఒకవేళ వేయకుంటే.. వారికిచ్చే రైతుబంధుసాయానికి కత్తెర వేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే. ఆయన కోరుకున్నట్లే.. తెలంగాణ వ్యాప్తంగా రైతులు పంటలు వేస్తున్నట్లుచెబుతున్నారు. ఇదే విషయం ఇప్పటికి సీఎం కేసీఆర్ వరకూ వెళ్లి ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా వ్యవసాయశాఖ చేపట్టిన అధ్యయనంలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.

తెలంగాణలో పంటలు పండించేందుకురసాయన ఎరువులు విపరీతంగా వాడేస్తున్నట్లుగా గుర్తించారు. గత ఏడాది విషయానికే వస్తే.. జాతీయసగటు కన్నా 261 శాతం అదనంగా రసాయనాలు వాడినట్లుగా గుర్తించారు. ప్రపంచ దేశాల్లో సగటున ఎకరానికి 78.4 కేజీల రసాయనాన్ని వినియోగిస్తుంటే.. భారతదేశంలో మాత్రం సగటున 51.2 కేజీలు వినియోగిస్తున్నారు.

అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం 185 కేజీలు వినియోగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇంత ఎక్కువగా రసాయన ఎరువులు వాడటానికి కారణం.. రాష్ట్రంలో భూసార పరీక్షల ఫలితాలు సరిగా లేకపోవటం.. రైతుల్లో అవగాహన లేమిగా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు.. అవసరానికి మించిన భాస్వరాన్ని వాడుతున్నట్లుగా గుర్తించారు.

ఇప్పటికే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నేలలు భాస్వరం శాతాలు సాధారణం కంటే అధికంగా ఉన్నాయి. మోతాదుకు మించి రసాయనాలు వాడటం వల్ల అవి కాస్తా నేలలో నిల్వలు పేరుకుంటున్నాయని.. వాటిని కరిగించేందుకు ఫాస్పరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా వాడాల్సి ఉందని చెబుతున్నారు. కానీ.. అలాంటివి వాడటం లేదు. ఏ ప్రాంతానికి చెందిన వారు ఏ పంట వాడుతున్నారన్న విషయంపై కంట్రోల్ పెట్టిన కేసీఆర్.. రసాయన ఎరువుల విషయంలో అలాంటి పరిమితులు పెట్టాల్సిన సమయం వచ్చేసిందని చెప్పాలి. ఇంతకీ.. తెలంగాణలో రసాయన ఎరువుల వాడకం సంగతి సారు వరకూ వెళ్లిందా?

Next Story