భాగ్యనగరంలో అరుదైన ఘటన.. ఏడేళ్ల కిందట దాచుకున్న వీర్యంతో సంతాన భాగ్యం
By సుభాష్ Published on 7 Sep 2020 9:04 AM GMTకొంత మందికి పిల్లలు లేక మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. పెళ్లై ఏళ్లు దాటుతున్నా.. సంతానం కలగక మానసికంగా కుంగిపోతుంటారు. తిరగని ఆస్పత్రులు ఉండవు. అలాంటిది హైదరాబాద్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఏడు సంవత్సరాల కిందట ఓ జంట దాచుకున్నవీర్యం ఇప్పుడు వారికి సంతాన భాగ్యం కలిగింది. ఆ సమయంలోనే ముందు జాగ్రత్తతో వీర్యాన్ని భద్రపర్చుకోగా, తాజాగా ఆ జంటకు పండంటి బిడ్డ జన్మించింది. అనారోగ్య సమస్యల కారణంగా ముందు జాగ్రత్త తీసుకోవడంతో కోలుకున్న తర్వాత పిల్లలు కలిగే అవకాశం లేకపోయినా.. వీర్యంతో ఆడ శిశువు జన్మించింది. వివరాల్లోకి వెళితే..
2012లో ఆ జంటకు వివాహమైంది. కానీ పెళ్లాయిన ఏడాదికే భర్తకు క్యాన్సర్ సోకింది. భర్తకు ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య మెడియాస్టినల్ ట్యూమర్ గుర్తించారు వైద్యులు. అతడి వయసు అప్పుడు 23 సంవత్సరాలు. అయితే వైద్యుల సహా మేరకు క్యాన్సర్ చికిత్స ప్రారంభించే ముందు అతను తన వీర్యాన్ని సేకరించి జాగ్రత్త స్పెర్మ్ బ్యాంకులో భద్రపరుచుకున్నాడు.
2012లో బంజారాహిల్స్‌లోని ఓ పైవేటు ఫెర్టిలిటీ కేంద్రంలో ఆయన వీర్యాన్ని దాచుకున్నాడు. గత సంవత్సరం ఆ వ్యక్తి క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా అతనికి కీమో థెరపీ, రేడియో థెరపీలు చేయాల్సి వచ్చింది. ఈ పద్దతుల వల్ల ఆ వ్యక్తి పిల్లలు పుట్టే సామర్థ్యాన్ని కోల్పోయాడు. దీంతో ముందు జాగ్రత్తగా స్పెర్మ్ బ్యాంకులో దాచుకున్న వీర్యం ద్వారా సంతానం పొందవచ్చని వైద్యులు చెప్పారు.
గత ఏడాది ఆ వ్యక్తి క్యాన్సర్ నుంచి కోలుకోగానే ఫెర్టిలిటీ కేంద్రాన్నిసంప్రదించి చికిత్స ప్రారంభించారు. ఐసీఎస్‌ఐను మ్యాక్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 2019లో పిండాన్ని తల్లి కడుపులో ప్రవేశపెట్టారు. ఇది ఫలించి గత వారం ఆ మహిళ ఆడ శిశువుకు జన్మించినట్లు హైదరాబాద్‌లోని ఒయాసిస్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఎంతో మంది దంపతులు సంతానం లేక ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ముందు జాగ్రత్త చర్యతో వీర్యం దాచుకోవడంతో ఆ దంపతులకు సంతాన భాగ్యం కలిగింది.