ఆస్పత్రిని పేల్చేందుకు కుట్ర.. అనుమానితుడిని కాల్చి చంపిన FBI

By అంజి  Published on  26 March 2020 5:18 PM GMT
ఆస్పత్రిని పేల్చేందుకు కుట్ర.. అనుమానితుడిని కాల్చి చంపిన FBI

హైదరాబాద్‌: 'కరోనావైరస్ రోగులకు చికిత్స చేస్తున్న మిస్సోరీలోని ఆస్పత్రిని పేల్చేసేందుకు కుట్ర... అనుమానితుడి కాల్చివేత' అంటూ బీబీసీ తెలుగు కథనం రాసింది. ఆ కథనం మేరకు.. అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 70 వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే.. మిస్సోరీ రాష్ట్రంలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిపై బాంబు దాడికి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని కాల్చి చంపినట్లు ఎఫ్‌బీఐ అధికారులు వెల్లడించారని బీబీసీ తెలుగు తెలిపింది.

బెల్టన్‌ పట్టణంలో 36 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్‌ చేసేందుకు ఎఫ్‌బీఐ ఏజెంట్లు ప్రయత్నించారు. దీంతో అతడు ఎదురు తిరిగాడని ఎఫ్‌బీఐ పేర్కొంది. అతడు ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షింపబడ్డాడని అక్కడి అధికారులు తెలిపారు. నిందితుడు తిమోతి ఆర్‌ విల్సన్‌గా గుర్తించిన ఎఫ్‌బీఐ.. అతని కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. అతడు జాత్యంహకార, మత విద్వేషాలు కలిగిన ఒక క్రూరమైన తీవ్రవాది అంటూ ఎఫ్‌బీఐ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విల్సన్‌ ఇంతకు ముందు చాలా నేరాలు చేశాడని ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఓ స్కూల్‌పై, మసీదుపై, ప్రార్థనా మందిరంపై దాడికి పాల్పడ్డాడని తెలిపింది. చాలా మందిని పొట్టన పెట్టుకోవాలన్న ఆలోచనతోనే అతడు బెల్టన్‌ పట్టణంలోని రద్దీగా ఉండే ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసిందని అధికారులు చెప్పారు.

Also Read: కరోనాపై సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తల్లో ఎంత వరకు నిజం..!

అయితే నిందితుడు విల్సన్‌ అంతకు ముందు చాలా ప్రాంతాలను పరిశీలించాడని విచారణలో తేలింది. ఆస్పత్రిలో బాంబు అమర్చేందుకు పేలుడు పదార్థాలను సిద్దం చేశాడని ఎఫ్‌బీఐ తెలిపిందని.. బీబీసీ తెలుగు తన కథనంలో పేర్కొంది. విల్సన్‌ అరెస్ట్‌ చేసేందుకు వెళ్లగా.. అతడు ఎఫ్‌బీఐ ఏజెంట్లపై ఎదురు కాల్పులకు దిగాడు. ఆ తర్వాత చాలా సేపు కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం అతన్ని ఆస్పత్రికి తరలించాక చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Also Read: భారత్‌లో ఒక్క రోజే 88 కరోనా కేసులు..

ఇక మిస్సోరీ రాష్ట్రాన్ని కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 356 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 8 మంది మృత్యువాత పడ్డారు.

Next Story