మీ ముగ్గురూ పదవి కోసం పోరాడుతూంటే మేం 300 మంది చనిపోయాం....!!

By Newsmeter.Network  Published on  3 Jan 2020 7:42 AM GMT
మీ ముగ్గురూ పదవి కోసం పోరాడుతూంటే మేం 300 మంది చనిపోయాం....!!

ఒకాయన రైతు నేత. రైతుల సమస్యలపై పోరాడే ఆయన నాయకుడయ్యాడు. ఇంకొకాయన చెరుకు రైతుల లాబీకి పెద్ద దిక్కు. రైతుల కోసమే ఆయన జీవిస్తున్నాడు. మరొకాయన రైతుల ఆత్మహత్యలు రోజుకొకటిగా జరిగే ప్రాంతం నుంచి వచ్చిన నాయకుడు. వీరందరూ రైతుల కోసమే జీవిస్తున్నామని, వారి హక్కుల కోసమే పోరాడుతున్నామని చెప్పే వారే. కానీ వీరంతా అధికారం కోసం కుమ్ములాడుకుంటూ నెలల తరబడి రాజకీయ సంక్షోభాన్ని సృష్టించారు. రాష్ట్రంలో ప్రభుత్వమే లేకుండా చేశారు. చివరికి ఎలాగోలా ప్రభుత్వం ఏర్పడ్డా ఇప్పటి దాకా మంత్రులు లేరు. పాలన లేదు. మెజారిటీ లెక్కల్లోనే వీరంతా ఇప్పటికీ మునిగితేలుతున్నారు.

ఇదీ గత నాలుగైదు నెలల మహారాష్ట్ర కథ. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నేత అశోక్ దేశ్ ముఖ్ రైతు నేత. శరద్ పవార్ రాజకీయమే రైతు రాజకీయం. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీన్ ది రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే విదర్భ ప్రాంతం. వీరంతా “కౌన్ బనేగా ముఖ్యమంత్రి” ఆట ఆడుకుంటూ ఉన్న సమయంలోనే మహారాష్ట్రలో దాదాపు 300 మంది రైతులు చనిపోయారు. అప్పుల బాధతో కొందరు, పంట నష్టాలతో కొందరు, ఆకలి దప్పులతో కొందరు చనిపోయారు. కొందరు ఉరేసుకున్నారు. ఇంకొందరు విషం తాగారు. మరి కొందరు రైలు కింద, రైలు పట్టాల మీద తలలు పెట్టారు.

ఒక వైపు రాజకీయం వికటాట్టహాసం చేస్తున్న సమయంలోనే మరో వైపు రైతులు చచ్చిపోతున్నారు. ఇదీ మహారాష్ట్ర మహా విషాద గాథ. 2015 తరువాత ఒక నెలలో మూడువందల మంది రైతులు చనిపోవడం ఇదే మొదటి సారి. అసమయంలో వచ్చిన వానల వల్ల ఖరీఫ్ పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఈ ఆత్మహత్యలు పెరిగాయి. ఖరీఫ్ వానల వల్ల కోటి మంది రైతులు దెబ్బ తిన్నారు. కోటి మంది అంటే స్వీడెన్ దేశం జనాభాతో సమానం. రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 60 శాతం. మహారాష్ట్ర రైతు మరణాల్లో విషాదం ఏమిటంటే మరాఠ్వాడా ప్రాంతంలో చుక్క వాన లేక నేల బీడు పడింది. పంట మాడిపోయింది. రైతులు నష్టపోయారు. అదే పశ్చిమ మహారాష్ట్ర, కొంకణ ప్రాంతంలో పంట చేతికొచ్చే సమయంలో భీకరంగా వానలు పడ్డాయి. దీంతో పంట పాడైపోయింది.

నిరంతర కరువు ప్రాంతం మరాఠ్వాడాలో ఎక్కువ మంది చనిపోయారు. ఆ తరువాత విదర్భలో ఎక్కువ మంది చనిపోయారు. మరాఠ్వాడాలో 120 మంది చనిపోగా, విదర్భలో 112 మంది చనిపోయారు. 2018 లో జనవరి నుంచి నవంబర్ మధ్యలో 2518 మంది చనిపోతే 2019 లో అదే సమయంలో 2538 మంది చనిపోయారు.

ఇదే సమయంలో మహరాష్ట్రలో పార్టీలు అధికారం కోసం ఎత్తులు పైఎత్తులు వేస్తూ, ఎమ్మెల్యేలకు కన్ను గీటుతూ, కాసుల వల వేస్తూ గడిపేశాయి. ఏలినవారు ముఖ్యమంత్రి పదవిని అధిరోహిస్తూంటే రైతన్నలు ఆర్తనాదాలు చేస్తూ అలమటిస్తూ ఉండిపోయారు.

Next Story