3 బల్బులు.. 2 ఫ్యాన్లు.. బిల్లు మాత్రం రూ.7 లక్షలు
By సుభాష్ Published on 13 Jun 2020 4:44 PM ISTతెలంగాణలో ఓ వ్యక్తికి వచ్చిన కరెంటు బిల్లు షాకిచ్చింది. బిల్లు చూసిన వినియోగదారుడు బిత్తరపోయాడు. ప్రతి నెల వందల్లో వచ్చే బిల్లు ఈసారి ఏకంగా లక్షల్లో రావడం చూసి ఖంగుతిన్నాడు. ఏం చేయలో అర్థంకాక షాక్ గురయ్యాడు. కరెంటును ముట్టుకుంటేనే షాక్ కొడుతుంటే .. ముట్టుకోకుండానే బిల్లు రూపంలో షాక్ కొడుతుందంటే ఆందోళనకు గురయ్యాడు. ఇలాంటి ఘటన ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.
తాజాగా వచ్చిన ఈ కరెంటు బిల్లు హట్‌టాపిగ్గా మారింది. 3 బల్బులు,2 ఫ్యాన్లు ఉన్న ఆ ఇంటికి ఏకంగా రూ.7లక్షల కరెంటు బిల్లు రావడంతో సదరు వినియోగదారుడు బిత్తరపోయాడు. ఇంత బిల్లు ఎలా చెల్లించాలని వాపోయాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఇస్రోజీవాడ గ్రామంలో చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రతి నెల 500 వచ్చేది. ఈ సారి మూడు నెలలకు ఏకంగా రూ. 7.29 లక్షలు రావడంతో షాక్‌కు గురయ్యాడు. ఇంత బిల్లు వచ్చిన వెంటనే విద్యుత్ అధికారి వద్దకు వెళ్లి నిలదీయగా, స్లాబ్ ప్రకారమే బిల్లు ఇచ్చామని, 76వేల యూనిట్ల విద్యుత్ వాడినట్లు అధికారులు చెప్పినట్లు శ్రీనివాస్ వెల్లడించారు. ఫిబ్రవరి నుంచి జూన్ 9వ తేదీ వరకూ మొత్తం 76వేల 871యూనిట్ల కరెంటును వాడినట్లు తేలిందని, అందుకే ఇంత బిల్లు వచ్చిందంటూ చెప్పుకొచ్చారు అధికారులు.
వాడేదే మూడు బల్బులు, రెండు ఫ్యాన్లకు ఇంత బిల్లు ఎలా వస్తుందని శ్రీనివాస్ అధికారులను నిలదీశాడు. ఇక తమకేమి తెలియదంటూ అధికారులు తప్పించుకున్నారు. ఒక్కశ్రీనివాసే కాదు.. ఇలాంటి ఎందరో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా మూడు నెలల విద్యుత్ బిల్లు అధికారులు రీడింగ్ తీయలేదు. లాక్‌డౌన్ 5వ దశలో సడలింపులు ఇవ్వడంతో మళ్లీ మీటర్‌రీడింగ్ తీసే పనిలో ఉన్నారు విద్యుత్ సిబ్బంది. ఇలా మూడు నెలలకు వస్తున్న బిల్లులను చూసి వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. మూడు నెలలకు రీడింగ్ తీస్తుండటంతో శ్లాబ్‌రేట్లు మారిపోతున్నాయి. వందల్లో రావాల్సిన కరెంటు బిల్లులు వేలు, లక్షల్లో రావడంతో ఆందోళన చెబుతున్నారు.