ఉగ్ర నిధులపై స్పందించకుంటే ' బ్లాక్ లిస్ట్' లో చేరుస్తాం..! పాక్‌కు హెచ్చరిక..!
By న్యూస్‌మీటర్ తెలుగు
ఉగ్రవాదానికి అడ్డగా మారిన పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదిక 'ఆర్థిక చర్యల కార్యాదళం' తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. తాను నిర్దేశించిన 27 లక్ష్యాలను చాలా వరకూ అందుకోలేదని వ్యాఖ్యానించింది. నాలుగు నెలల్లోగా ఈ లోపాలను సరిచేసుకోకుంటే పాక్‌ను ' బ్లాక్ లిస్ట్‌లో పెట్టక తప్పదని హెచ్చరించింది. అయితే అప్పటి వరకూ ఆ దేశాన్ని 'గ్రే జాబితా' లోనే ఉంచనున్నట్లు తెలిపింది.
ఉగ్రవాదులకు నిధులు, నగదు అక్రమ చలామణిపై ఎఫ్‌ఏటీఎఫ్ కన్నేసి ఉంచుతుంది. పారిస్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ఐదు రోజుల ప్లీనరీ శుక్రవారం ముగిసింది. ఈ భేటీలో పాక్ తీరును కూలంకషంగా చర్చించింది.
లష్కర్ తొయిబా, జైష్ ఎ మహ్మద్ వంటి ఉగ్రవాద ముఠాలకు నిధులు అందకుండా కట్టడి చేసేందుకు 27 లక్ష్యాలతో క్యార్యాచరణను గతంలో ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించింది. అయితే వాటిలో ఐదింటిని మాత్రమే పాక్ నెరవేర్చడంతో..తాజా సమావేశంలో గుర్తించింది. అంతర్జాతీయ ఉగ్ర నిధుల ముప్పును ఎదుర్కొనే అంశంలో పురోగతి లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో పాక్ 'గ్రే లిస్ట్' లో కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
అయితే నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళికను పూర్తి స్థాయిలో అమలుచేసి, వచ్చే ప్లీనరీ నాటికి గణనీయ స్థాయిలో పురోగతి చూపకుంటే.. ఆ దేశంతో ముడిపడి ఉన్న వ్యాపార సంబంధాలు, లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సభ్య దేశాలన్నింటికీ సూచించటం సహా పలు చర్యలు చేపట్టాల్సి వస్తుంది' అని ఎఫ్‌ఏటీఎఫ్ స్పష్టం చేసింది. అయితే ఎఫ్ఏటీఎఫ్ వ్యాఖ్యలు పాక్ కు ఎదురుదెబ్బేనని..వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాక్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం దాదాపుగా ఖాయమైనట్లేనని భారత అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చైనా సాయంతో పాక్ 'బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించుకోవాలని పాక్ భావిస్తోంది.