నిజనిర్దారణ: కరోనాతో చనిపోయిన వాళ్ల మృతదేహాలను సముద్రంలో విసిరేస్తున్నారా ?

By అంజి
Published on : 8 April 2020 10:01 PM IST

నిజనిర్దారణ: కరోనాతో చనిపోయిన వాళ్ల మృతదేహాలను సముద్రంలో విసిరేస్తున్నారా ?

ముఖ్యాంశాలు

  • సముద్ర ప్రాణులను తినడం హానికరమా ?
  • వాట్సప్‌లో తప్పుడు వార్తల వ్యాప్తి

కరోనా కరాళ నృత్యం చేస్తోంది. భూగోళాన్నే భయపెట్టిస్తోంది. దేశాలన్నింటినీ గడగడలాడిస్తోంది. సంపన్నదేశాలు, పేద దేశాలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు కూడా పుంఖాను పుంఖాలుగా వైరల్‌ అవుతున్నాయి. ప్రధానంగా వాట్సప్‌లో తప్పుడు వార్తల వ్యాప్తి అత్యధికమవుతోంది. ఫలితంగా ఏది నిజమో, ఏది అబద్ధమో జనం తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఫ్యాక్ట్‌చెక్‌ ఏకైక అస్త్రంగా మారింది.

సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తోన్న తప్పుడు వార్తల్లో ఇప్పుడు మరో కొత్త వీడియో వచ్చి చేరింది. ఓ సముద్రం ఒడ్డుకు పదుల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకొచ్చాయి. అవన్నీ కరోనా వైరస్‌తో చనిపోయిన వాళ్ల మృతదేహాలని ప్రచారం జరుగుతోంది. కొన్ని దేశాల్లో కరోనాతో చనిపోయిన వాళ్ల మృతదేహాలను సముద్రంలో పడేస్తున్నారని, ఆ మృతదేహాలు ఏదో ఓ ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

ఆ వీడియోను పరిశీలిస్తే.. పలు మృతదేహాలు సముద్రం ఒడ్డున నిర్జీవంగా పడి ఉన్నాయి. సహాయక బృందాలు, రెస్క్యూ టీమ్‌లు ఆ మృతదేహాలను సేకరిస్తున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్‌ బారిన పడి దేశ విదేశాల్లో రోజూ పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వీడియో కూడా నిజమే అన్న సందేహం అదరిలోనూ కలుగుతోంది.

21

ఈ వీడియోతో పాటు.. దీనికి సంబంధించిన ఓ రైటప్‌ కూడా సోషల్‌ మీడియాలో తిరుగుతోంది. ఆ రైటప్‌ ఇంగ్లీష్‌లో ఉంది.

''Some countries throw Covid 19 infected dead bodies into the seas. Advice to stop eating seafood.

The World is really coming to an end.

Dear God, Please intervene.''

అన్న సందేశం ఈ వీడియోకు జోడించబడింది.

ఈ సందేశాన్ని తెలుగులో అనువదిస్తే.. ''కొన్ని దేశాలు కోవిడ్ 19 సోకిన మృతదేహాలను సముద్రాలలో పడవేస్తున్నాయి. కాబట్టి సముద్ర ప్రాణులను తినే అలవాటున్నవాళ్లు ఆ అలవాటును మానుకోవాలని సలహా.

ప్రపంచం అంతం నిజంగా దరిచేరింది.

ప్రియమైన దేవా, దయచేసి జోక్యం చేసుకోండి.'' అన్నది దీని సారాంశం.

అయితే, ఈ వీడియో నిజమేనా ? ఇవి కోవిడ్‌ 19 బారిన పడిన మృతదేహాలేనా ? నిజంగానే రెస్క్యూ టీమ్‌లు ఆ మృతదేహాలను సేకరించి వేరే చోట ఖననం చేస్తున్నాయా ? అన్నది చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఫ్యాక్ట్‌చెక్‌ అనివార్యమయ్యింది.

వాస్తవానికి ఇది ఇప్పటి వీడియో కాదు. 2017, డిసెంబర్‌ 14 వ తేదీన యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయిన వీడియో ఇది. razy What'sApp Videos అనే యూట్యూబ్‌ యూజర్‌లో ఈ వీడియోను అప్‌లోడ్‌ చేశారు. ఈ వీడియో ఒక నిమిషం 55 సెకన్ల నిడివి ఉంది. Death body Flowing on the Beach అనే క్యాప్షన్‌ ను ఈ వీడియోకు జతచేశారు.

ప్రచారం : కోవిడ్‌ 19 తో చనిపోయిన వాళ్ల మృతదేహాలను కొన్ని దేశాలు సముద్రంలో విసిరేస్తున్నాయి.

వాస్తవం : ఇది 2017 డిసెంబర్‌ 14వ తేదీన యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయిన వీడియో. అప్పటికి అసలు కోవిడ్‌ 19 లేదు.

కంక్లూజన్‌ : ఇలా.. కరోనా పాజిటివ్‌ మృతదేహాలను సముద్రంలో పడేస్తున్న కారణంగా సముద్ర ప్రాణులను తినడం మానేయాలని సోషల్‌ మీడియాలో సలహా ఇస్తున్నారు. కానీ, ఇది వాస్తవం కాదు. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయిన పాత వీడియో...

- సుజాత గోపగోని

Next Story