చంద్రబాబు రాజకీయ వికలాంగుడన్న మంత్రి పెద్దిరెడ్డి.. అచ్చెన్నాయుడు ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని రాజకీయ వికలాంగుడు అంటూ వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 20 March 2024 9:00 PM ISTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని రాజకీయ వికలాంగుడు అంటూ వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులు లేకుండా చంద్రబాబు పోటీ చేయలేడన్నారు. పొత్తులు లేకపోతే చంద్రబాబు నిలబడలేడని.. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం చంద్రబాబు నాయుడిదని విమర్శించారు. టీడీపీకి బీజేపీ, జనసేన ఊతకర్రలుగా మారాయని.. మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఈ మూడు పార్టీల పొత్తును తాము ముందే ఊహించామని.. ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేసి గతంలో కంటే భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు రాజధానులకు జగన్ కట్టుబడి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ చీఫ్ కింజారపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరోడ్డు నోరు అదుపులో పెట్టుకోవాలని.. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే పుంగనూరులో పెద్దిరెడ్డి ఓటమి ఖాయమని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు. పెద్దిరెడ్డి ఎన్నో హత్యలు చేయించాడు. ఈ హత్యలకు బలైన కుటుంబాల చేతుల్లో ఎప్పుడో ఒకప్పుడు పెద్దిరెడ్డి వికలాంగుడౌతాడేమోనని అతని అంతరాత్మ చెబుతున్నట్టున్నది. అందుకే పెద్దిరెడ్డి తన స్థితిని చంద్రబాబుకు అంటగట్టి నోరుపారేసుకుంటున్నాడన్నారు. పొత్తులు పెట్టుకొన్నందుకు చంద్రబాబును రాజకీయ వికలాంగుడంటున్న పెద్దిరెడ్డికి దమ్ముంటే పొత్తులపై నరేంద్రమోదీని ఆ మాట అనగలడా? టీడీపీ పొత్తలు బహిరంగం. జగన్ రెడ్డివి చీకటి పొత్తులు కాదా? మాఫియాలతో, కళంకితులతో జగన్ పొత్తులు ప్రజలకు తెలుసన్నారు.