ఓ పోలీసు కానిస్టేబుల్ ను లక్నో లోని ఓ మాల్ లో కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. సలీమ్ అనే వ్యక్తిని అందరూ కలిసి కొడుతున్నారంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. సలీమ్ కు సినిమా చూపించారని పోస్టులు వైరల్ అవుతున్నాయి.
లక్నోలో సలీమ్ కు సినిమా చూపించారు: సైనికుడైన సలీమ్ మాల్ లో షాపింగ్ కు వెళ్ళాడు. టీ షర్ట్ లను కొట్టేశాడంటూ పలువురు అతడిని కొట్టారు. ట్రయల్ రూమ్ కు వెళ్లిన సలీమ్ టీ షర్ట్ లను లోపల దాచుకున్నాడు. అతడు బయటకు వచ్చి అక్కడ పనిచేసే వ్యక్తులను దబాయించాడు. దీంతో అతడి మీద దాడి చేయడం జరిగింది. అంటూ హిందీలో ఉన్న పోస్టు వైరల్ అవుతూ ఉంది.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. అతడి పేరు సలీమ్ కాదు. కమ్యూనల్ యాంగిల్ లో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
ఈ ఘటన గురించి సెర్చ్ చేయగా.. మాల్ లోని వాళ్లు దాడి చేసింది ఓ పోలీసు కానిస్టేబుల్ అని తెలుస్తోంది. అతడు షాపింగ్ మాల్ లోని బట్టలను కొట్టేయడంతో ఉద్యోగులు అతడిని కొట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పలు మీడియా సంస్థలు స్పష్టం చేశాయి.
Amar Ujala కథనం ప్రకారం వీడియోలో ఉన్న కానిస్టేబుల్ హుస్సేన్ గంజ్ లో ఉన్న వి-మార్ట్ కు వెళ్లాడు. అక్కడ మూడు టీ షర్ట్ లను తన పోలీసు యూనిఫామ్ కింద దాచుకుని బయటకు వచ్చేయడానికి ప్రయత్నించాడు. అయితే గేట్ దగ్గర అలారమ్ మోగడంతో అందులో పని చేసే వ్యక్తులు అతడిని చుట్టుముట్టి.. బట్టలు విప్పిస్తూ ఉండగా.. కొందరు అతడిని కొట్టారు కూడానూ..! దెబ్బలు తిన్న వ్యక్తిని 'ఆదేశ్ కుమార్' గా గుర్తించారు.
చాలా మీడియా సంస్థలు కూడా ఆ కానిస్టేబుల్ ను 'ఆదేశ్ కుమార్' అని తెలియజేశాయి.
కానిస్టేబుల్ ఆదేశ్ కుమార్ మొదట చాలా డ్రెస్ లను చెక్ చేశాడు. ఆ తర్వాత వాటిలో కొన్నిటిని పరిశీలించడానికి ట్రయల్ రూమ్ కు వెళ్ళాడు. అక్కడి నుండి బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్లకుండా బయటకు వెళ్ళిపోడానికి ప్రయత్నించాడు. ఇక బయటకు వెళ్లే గేట్ వద్ద ఉంచిన సెన్సార్ సౌండ్ చేయడంతో అతడిని సెక్యూరిటీ సిబ్బంది ఆప్ అతడిని పూర్తిగా చెక్ చేయగా.. మూడు టీషర్ట్ లను తన యూనిఫామ్ కింద దాచుకున్నాడు' అని ఆజ్ తక్ మీడియా సంస్థ రిపోర్ట్ చేసింది.
కాబట్టి వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది 'సలీమ్' అనే వ్యక్తి కాదు. అతడి పేరు 'ఆదేశ్ కుమార్'. మతం యాంగిల్ లో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.