రైల్వే గేట్ పడ్డాక కూడా రైలు పట్టాలకు దగ్గరగా వెళ్లిన ఓ వ్యక్తి బండిని అక్కడే పడేసి వెళ్లిపోగా.. అలా వెళ్లిన రైలు కాస్తా ఆ బండిని తుక్కుతుక్కు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
రైల్వే క్రాసింగ్ వద్ద చోటు చేసుకున్న ఈ వీడియోలో బైకర్ ప్రాణాలను నిలుపుకోగలిగాడు. రైల్వే గేట్ పడుతున్నా కూడా సదరు బైకర్ రైల్వే ట్రాక్ ను దాటేయాలని వచ్చేశాడు. కానీ ఆఖరి నిమిషంలో బైక్ ను కింద పడేసి పక్కకు వచ్చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో చోటు చేసుకుందని పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
ఈ ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
వైరల్ అవుతున్న వీడియోను చూడగా.. అందులో చుట్టుపక్కల ప్రాంతాల్లో హిందీలో ఎక్కువగా రాసి ఉంది. అలాగే రైలు మీద కూడా హిందీలో రాసి ఉండడాన్ని గమనించవచ్చు. చాలా వరకూ ఈ వీడియో ఉత్తర భారతదేశంలోనే చోటు చేసుకుని ఉండవచ్చని చెబుతూ ఉన్నారు.
ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. కొన్ని ఫేస్ బుక్ పోస్టుల్లో భర్వారీ మ్యాన్యువల్ రైల్వే క్రాసింగ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు.
Samayam.com తెలుగు ఎడిషన్ లో కూడా ఈ ఘటన రాజమండ్రిలోని అన్నపూర్ణ పేట రైల్వే క్రాసింగ్ వద్ద చోటు చేసుకోలేదని తెలిపారు. రాజమండ్రిలో చోటు చేసుకుందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు.
newsflare.com లో కూడా ఈ ఘటనకు సంబంధించిన కథనాలను పోస్టు చేశారు. వేగంగా వెళుతున్న రైలు మోటార్ సైకిల్ ను తుక్కు తుక్కు చేసిందంటూ కథనాలను రాసుకుని రాగా.. ఉత్తరప్రదేశ్ లోని భర్వారీలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనవరి 24న ఈ ఘటన జరిగింది. livehindustan.com లో కూడా ఈ ఘటనకు సంబంధించిన కథనాలను వేశారు.
Indiarailinfo.com ప్రకారం ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని భర్వారీలో చోటు చేసుకుంది. నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా 5 నిముషాలు ఆలస్యంగా రైలు ప్రయాణం సాగింది. ఈ ఘటనకు బాధ్యుడైన బైక్ నడిపిన వ్యక్తిపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.. రాజమండ్రిలో కాదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.