FactCheck : నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి పాకిస్థాన్ ను నాశనం చేస్తారని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారా..?
Viral video of Kejriwal saying Modi, Shah will destroy Pakistan is doctored. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ర్యాలీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Feb 2023 2:15 PM GMTఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ర్యాలీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మళ్లీ అధికారంలోకి వస్తే పాకిస్థాన్‌ను నాశనం చేస్తారని వీడియోలో కేజ్రీవాల్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో అరవింద్ కేజ్రీవాల్ 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు “మోదీ ఎన్నికల్లో గెలిస్తే పాకిస్థాన్ నాశనమైపోతుంది” అని జోస్యం చెప్పారని ట్విట్టర్ యూజర్ ఒకరు వీడియోను షేర్ చేశారు.
పలువురు ఫేస్‌బుక్ వినియోగదారులు కూడా ఇదే విషయాన్ని పేర్కొంటూ వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
వైరల్ వీడియోను ఎడిట్ చేశారని న్యూస్‌మీటర్ కనుగొంది.
వైరల్ వీడియోలో 'ETV తెలంగాణ' లోగో ఉంది. కొంతమంది వినియోగదారులు ఈ వీడియో కోల్‌కతాలో జరిగిన ర్యాలీకి సంబంధించినది పేర్కొన్నారు.
ఈ ఆధారాలను తీసుకొని, మేము ETV తెలంగాణ యూట్యూబ్ ఛానెల్‌లో కీవర్డ్ సెర్చ్ ను ఉపయోగించి వీడియో కోసం శోధించాము. 19 జనవరి 2019న ప్రచురించిన ఎక్కువ నిడివి ఉన్న వీడియోను కనుగొన్నాము. వీడియో పేరు “TMC Rally in Kolkata | PM Modi & Amit Shah’s Combo has Finished Country | says Arvind Kejriwal.” అని ఉంది.
దాదాపు 5.40 నిమిషాల సమయంలో, వైరల్ క్లిప్ వీడియోలో కనిపిస్తుంది. మోదీ, షా ద్వయం మళ్లీ అధికారంలోకి వస్తే ఈ దేశాన్ని నాశనం చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ అన్నట్లు మేము గుర్తించాం. వైరల్ వీడియోలో “దేశ్” అనే పదం స్థానంలో “పాకిస్తాన్” ను ఉంచారు.
మేము 2019లో కోల్‌కతాలో ప్రతిపక్షాల ర్యాలీ గురించి సెర్చ్ చేశాం. 19 జనవరి 2019న కోల్‌కతాలో జరిగిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన మెగా యునైటెడ్ ఇండియా ర్యాలీకి 20 మంది ప్రతిపక్ష నాయకులు హాజరయ్యారని కనుగొన్నాము.
ఈ ర్యాలీలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీలో మోదీ, షా మళ్లీ అధికారంలోకి వస్తే పాకిస్థాన్‌ను సర్వనాశనం చేస్తారంటూ అరవింద్ కేజ్రీవాల్ అన్నట్లు మాకు ఎలాంటి నివేదిక కనిపించలేదు.
వైరల్ వీడియో ఎడిట్ చేశారని మేము నిర్ధారించాము. ఎన్నికల్లో మోదీ గెలిస్తే పాకిస్తాన్ నాశనం అవుతుందని అరవింద్ కేజ్రీవాల్ 2019 పార్లమెంటరీ ఎన్నికలకు ముందు అంచనా వేశారంటూ జరుగుతున్న వాదన అబద్ధం.