నిజమెంత: వైరల్ వీడియోలో ఉన్నది హమాస్ నేత ఇస్మాయిల్ హనియే అంటూ ప్రచారం?హమాస్ నేత ఇస్మాయిల్ హనియే జూలై 31, 2024న టెహ్రాన్‌లో హత్యకు గురైనట్లు తేలింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఇస్మాయిల్ హనియే అక్కడికి వచ్చారు. టెహ్రాన్‌లోని నివాసంలో ఉండగా ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇస్మాయిల్ హనియే, అతని అంగరక్షకులలో ఒకరు మరణించారు. హనియే హతమయ్యాడని హమాస్ కూడా ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఖతార్‌లో ప్రవాసం తీసుకుంటూ.. హమాస్ రాజకీయ కార్యకలాపాలకు నాయకత్వం వహించాడు హనియే. ఇజ్రాయెల్-గాజా యుద్ధం మధ్య, కాల్పుల విరమణ చర్చలలో హనియే సంధానకర్తగా వ్యవహరించాడు.
ఈ నేపథ్యంలో.. ఆసుపత్రిలో గాయపడిన వ్యక్తికి వైద్యులు సహాయం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో ఉన్నది హనియే అంటూ.. అతని మరణానికి ముందు తీసిన విజువల్స్ ఇవని చెబుతూ ఉన్నారు.
ఒక X వినియోగదారు "బలిదానం చేయడానికి కొద్ది క్షణాల ముందు, షాహీద్ ఇస్మాయిల్ హనియా (అల్లాహ్ అతనిపై దయ చూపుగాక).. ఆయన చివరి మాటలు" అని పోస్టు పెట్టారు..
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తేల్చింది. వీడియో నవంబర్ 2023 నాటిది. ఒక పాలస్తీనియన్ గాయపడిన వీడియో ఇది.
వీడియో కీఫ్రేమ్‌ల రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించగా.. అది నవంబర్ 7, 2023న Xలో పోస్ట్ చేశారని మేము కనుగొన్నాము. ఆ వీడియో గాజాలో ఒక పాలస్తీనియన్ కు సంబంధించి. రక్తస్రావం అవుతున్నప్పుడు, తన చూపుడు వేలును పైకెత్తి, “మేము అందరం నిలబడతాము” అంటూ ఇజ్రాయెల్ పై తాము పోరాడతామని తెలిపారు.
నవంబర్ 6, 2023న ధృవీకరించిన.. టెలిగ్రామ్ ఛానెల్ గాజా నౌలో పోస్ట్ చేసిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. వీడియోలో పాలస్తీనాకు చెందిన వ్యక్తి గాయపడ్డాడని.. తీవ్ర రక్తస్రావం అవుతోందని ధృవీకరించారు.
అరబిక్ కంటెంట్ ప్లాట్‌ఫారమ్ Nabd నవంబర్ 6, 2023న ఈ వీడియోను ప్రచురించింది. ఒక పాలస్తీనియన్ రక్తస్రావం అవుతున్నప్పుడు పోరాడతాం అంటూ.. అరవడం వీడియోలో ఉందని టైటిల్ పేర్కొంది.
అందువల్ల, మేము వైరల్ వీడియో పాతదని.. హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియేకు సంబంధించిన వీడియో కాదని మేము నిర్ధారించాము.