ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. కొందరు వ్యాక్సిన్ వేసుకోడానికి వెనుకాడుతూ ఉంటే.. ఇంకొన్ని చోట్ల వ్యాక్సిన్ దొరకడం కూడా కష్టంగా మారింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతూ ఉంది. అందులో ఊపిరితిత్తుల సీటీ స్కాన్ ఫోటో అని చెబుతూ ఉన్నారు. ఒక వైపు ఉన్న ఫోటోలో వ్యాక్సిన్ వేయించుకోకముందు ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో చెబుతుండగా.. మరో వైపు వ్యాక్సిన్ వేయించుకున్నాక ఊపిరితిత్తుల ఫోటో ఇది అని చెబుతూ ఉంది. వ్యాక్సిన్ వేయించుకున్నాక ఊపిరితిత్తుల్లో ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. అది 3డీ సీటీ స్కాన్ అని.. వ్యాక్సిన్ వేయించుకున్న వారి ఊపిరితిత్తులు, కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళ ఊపిరితిత్తులు ఇలా ఉన్నాయని చెబుతూ ఉన్నారు. వ్యాక్సిన్ ఎంతో ముఖ్యమైందని దీని ద్వారా తేలింది. వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోండి అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
పలువురు ప్రముఖులు కూడా ఇదే పోస్టును సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేశారు. కిరణ్ బేడీ కూడా ఓ వీడియోను అప్లోడ్ చేశారు. కరోనా వ్యాక్సిన్ ఎలా వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తూ ఉందో చూడాలని ఆమె వీడియోను పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ:
ఊపిరితిత్తుల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 2020 ఏప్రిల్ నెలలో కూడా పలువురు ఈ ఫోటోలను పోస్టు చేశారు. అప్పటికి వ్యాక్సిన్లు అందుబాటులోకి కూడా రాలేదు. కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్నాక.. వేసుకున్న తర్వాత అంటూ ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న ఈ ఫోటోలను వాంకోవర్ కు చెందిన రీసర్చ్ ప్రతినిధులు గతంలో వివరణ ఇస్తూ చెప్పినవి. కోవిడ్-19 ఉందా లేదా అన్నది సీటీ స్కాన్ ను ఉపయోగించి తెలుసుకోవచ్చని వాంకోవర్ జనరల్ ఆసుపత్రికి చెందిన రీసెర్చర్లు, రేడియాలజిస్టులు కనుగొన్నారు. వాంకోవా జెనరల్ ఆసుపత్రి, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియానా, వాంకోవర్ కోస్టల్ హెల్త్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తలు, రేడియాలజిస్టులు ఈ పరిశోధనలు జరిపారు.
వాంకోవర్ కోస్టల్ హెల్త్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇదే ఫోటోను వారి వెబ్ సైట్ లో కూడా అప్లోడ్ చేసింది. చాలా మందికి చెందిన సీటీ స్కాన్ లు ఇవి అని వారు తెలిపారు. సీటీ స్కాన్ ల ద్వారా అందుకున్న డేటాతో కోవిడ్-19 గురించి పలు అంశాలను తెలుసుకున్నామని వివరించారు.
ఈ అంశాల ద్వారా తెలిసింది ఏమిటంటే వ్యాక్సిన్ వేసుకున్నాక ఊపిరితిత్తులు ఇలా ఉంటాయని సీటీ స్కాన్ లో తెలిసిందంటూ వైరల్ అవుతున్న ఫోటోలలో ఎటువంటి నిజం లేదు. ఈ ఫోటో 2020 ఏప్రిల్ నుండే వైరల్ అవుతూ ఉంది. అప్పటికి కరోనాకు వ్యాక్సిన్లు కూడా రాలేదు.