ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పలువురు సినీ తారలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అలాగే ఆయా పార్టీలకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉంటూ ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
తెలుగుదేశం పార్టీ (TDP) ఎన్నికల గుర్తుతో జూనియర్ ఎన్టీఆర్ చిత్రం వైరల్ అవుతోంది. అతని చొక్కాపై సైకిల్ గుర్తు ఉంది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ మద్దతు తెలిపారంటూ పలువురు పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్న వారు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. టీడీపీతో అనుబంధంతో ఉన్న X ప్రీమియం ఖాతాలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి తన మద్దతును చూపుతున్నట్లు పేర్కొంటూ చిత్రాన్ని షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న చిత్రం మార్ఫింగ్ చేశారు. కాబట్టి వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుగొంది.
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వైరల్ ఇమేజ్‌ని వెతికాం. ఏప్రిల్ 21, 2024న ‘Jr NTR exudes style in a casual outfit as he lands in Mumbai for War 2 shoot with Hrithik Roshan’ అనే శీర్షికతో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన మీడియా నివేదికను మేము చూశాం. ఆ నివేదికలో వైరల్ ఫోటో ఉంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తెల్ల చొక్కా మీద సైకిల్ ప్రింట్ లేదు.
ఏప్రిల్ 21న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఫోటోగ్రాఫర్లు ఈ ఫోటోను క్లిక్ చేసారు. 'డెనిమ్ జీన్స్, బ్లాక్ సన్ గ్లాసెస్, బ్లాక్ క్యాప్‌తో తెల్లటి చొక్కా' ధరించాడని పలు నివేదికలు తెలిపాయి.
మేము ఇండియా టుడే, న్యూస్ 18లో కూడా అదే నివేదికను కనుగొన్నాము. ఎక్కడా కూడా అతని చొక్కాపై సైకిల్ చిహ్నం కనిపించలేదు.
ఏప్రిల్ 22, 2024 న ‘Jr NTR flaunts trendy ensemble at Mumbai airport’ అనే శీర్షికతో ANI వీడియో నివేదికను కూడా మేము కనుగొన్నాము. ఇతర నివేదికలలో చెప్పినట్లుగానే జూనియర్ ఎన్టీఆర్ అదే తరహా దుస్తులను ధరించారు. ఎక్కడా కూడా సైకిల్ గుర్తు ఉన్న షర్టును ధరించలేదు.
చొక్కాపై టీడీపీ గుర్తుతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్న వైరల్ చిత్రం మార్ఫింగ్ చేశారు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Credits : Sunanda Naik